- గగనతలం నుంచి గ్రిడ్ల దాకా రక్షణ కవచం
- ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్‌లను మించిన రక్షణ
- పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారీ
Mission Sudarshan Chakra | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మరో కీలక నిర్ణయం – “మిషన్ సుదర్శన్ చక్ర”. ఇది దేశ రక్షణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా, భారత గగనతలాన్ని మరింత సురక్షితంగా మార్చే ప్రణాళిక. ఈ మల్టీ-లేయర్ డిఫెన్స్ షీల్డ్ వ్యవస్థ, ఇజ్రాయెల్ ప్రసిద్ధ ‘ఐరన్ డోమ్’, అలాగే అమెరికా ప్రతిపాదించిన ‘గోల్డెన్ డోమ్’ లాగా కేవలం క్షిపణి రక్షణకే కాక, అన్ని రకాల దాడులను నివారిస్తుంది.
ప్రధాని ప్రకటన ప్రకారం, ఈ రక్షణ కవచం కేవలం క్షిపణి దాడుల నుంచే కాకుండా, ఉగ్రవాద దాడులు, సైబర్ దాడులు, శత్రు గూఢచర్యం వంటి పలు విభిన్న ముప్పుల నుండి దేశాన్ని రక్షించనుంది. 2035 నాటికి దీన్ని పూర్తిస్థాయిలో నిర్మించి, బలోపేతం చేసి, ఆధునికీకరించాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీకృష్ణుడి సుదర్శన చక్ర ప్రేరణతో, శత్రువులను శిక్షించడమే కాకుండా, తన పౌరులను రక్షించడం కూడా ఈ మిషన్ బాధ్యత. “భారతీయ పౌరులందరూ తాము భద్రంగా ఉన్నామనే నమ్మకంతో జీవించాలి” అని ప్రధాని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ – అమెరికా ‘గోల్డెన్ డోమ్’ తరహా కవచం
ప్రపంచంలో ఇప్పటికే ఉన్న రక్షణ కవచాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’. ఇది 2011 నుండి గాజా, లెబనాన్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే రాకెట్ దాడులను 90% కంటే ఎక్కువ సార్లు అడ్డుకుంది. అమెరికా ఇటీవల ‘గోల్డెన్ డోమ్’ ప్రణాళికను ప్రకటించింది, ఇది భూమి, సముద్రం, అంతరిక్షం అంతటా క్షిపణి రక్షణ కవచాన్ని ఏర్పరచనుంది. క్షిపణి రక్షణ విషయంలో భారత ‘సుదర్శన్ చక్ర’ కూడా అదే స్థాయి, ఇంకా వాటితో పాటు, ఇతర వ్యవస్థలనూ రక్షిస్తుంది. దాడి ఏదైనా సుదర్శన్ చక్ర వ్యవస్థ ధీటుగా ఎదిరిస్తుంది. భౌతిక దాడులు, సాఫ్ట్వేర్ దాడులతో సహా ఇతర తరహా దాడులను నిర్వీర్యం చేసే సుదర్శన చక్రం పూర్తిగా దేశీయ సాంకేతికతతో నిర్మించబడుతుంది.
ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం ఉపయోగించిన ‘ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్’ (IACCS) వల్ల పాకిస్తాన్ క్షిపణులు దాదాపు 100 గంటల పాటు మన సరిహద్దులు దాటలేకపోయాయి. అదే సిస్టమ్‌ను కేంద్రంగా ఉంచుకుని, కొత్త ‘సుదర్శన్ చక్ర’ను ఇంకా శక్తివంతం చేయనున్నారు. ఈ కొత్త రక్షణ కవచం సైబర్ ముప్పులను కూడా అడ్డుకోనుంది. హాకింగ్, ఫిషింగ్, డిజిటల్ గూఢచర్యం, ముఖ్యమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, విద్యుత్ గ్రిడ్‌లు, నీటి సరఫరా వ్యవస్థలు వంటి కీలక మౌలిక వసతులపై దాడులు జరిగే అవకాశాలను ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేసే యాంటీ-సైబర్ వార్ ఫీచర్లు ఇందులో ఉంటాయి.ఈ మిషన్‌లో దేశీయ రక్షణ పరిశోధనా సంస్థలు, సైన్యం, ప్రైవేట్ రంగం కలిసి పనిచేయనున్నారు. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా దేశీయ సాంకేతికత, తయారీని ప్రోత్సహిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి టియర్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ 2011 నుండి ఇప్పటివరకు వేల సంఖ్యలో రాకెట్లను అడ్డుకుంది. అమెరికా ప్రతిపాదించిన ‘గోల్డెన్ డోమ్’ కూడా రాబోయే ఏళ్లలో భూభాగం, సముద్రం, అంతరిక్షం అంతటా విస్తరించనున్న రక్షణ కవచం. ప్రపంచ వ్యాప్తంగా రష్యా S-400, చైనా HQ-9, జపాన్ PAC-3, తైవాన్ స్కై బో వంటి సిస్టమ్స్ వల్ల గగనతల రక్షణ పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో, భారత రక్షణ వ్యవస్థలో సుదర్శన్ చక్ర వంటి అప్‌గ్రేడ్ అత్యవసరం అయ్యింది.
మిషన్ సుదర్శన్ చక్ర అమలులోకి వస్తే, భారత రక్షణ వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాల్లో అత్యాధునిక స్థాయికి చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది కేవలం గగనతలానికి మాత్రమే కాకుండా, విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, నీటి సరఫరా, వైద్య సదుపాయాలు, రక్షణ కేంద్రాలు వంటి కీలక మౌలిక సదుపాయాలను కూడా రక్షించనుంది.