ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్ 20 వరకు పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. కవిత రిమాండ్‌ను 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరగా కోర్టు ఆరు రోజుల వరకు మాత్రమే పొడిగించింది.

  • Publish Date - May 14, 2024 / 04:23 PM IST

రెండు నెలలుగా జైలులోనే

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. కవిత రిమాండ్‌ను 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరగా కోర్టు ఆరు రోజుల వరకు మాత్రమే పొడిగించింది. లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసులోనూ కవిత జ్యూడిషియల్ రిమాండ్ గడువు కూడా ఈ నెల 20వరకు ఉండటం గమనార్హం. కవిత అరెస్టయి బుధవారంతో రెండు నెలలు పూర్తి కానుంది. కోర్టు విచారణకు ఆమెను తీహార్ జైలు నుంచే వర్చువల్‌గా హాజరుపరిచారు. కేసుకు సంబంధించి ఈడీ వేసిన 8వేల పేజీల సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌పై కూడా ఈ నెల 20వ తేదీన విచారిస్తామని కోర్టు తెలిపింది. మరోవైపు ఇదే కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.

అదనపు చార్జిషీటులో కవితతోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచార వ్యవహారాలు పర్యవేక్షించిన చారియట్‌ ప్రొడక్షన్స్‌ మీడియాకు చెందిన ముగ్గురు ఉద్యోగులు దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, చరణ్‌ప్రీత్‌సింగ్‌, ఇండియా అహెడ్‌ న్యూస్‌చానల్‌ మాజీ ఉద్యోగి అర్వింద్‌సింగ్‌ పేర్లను ఈడీ చేర్చింది.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో పెద్ద సంఖ్యలో లిక్కర్‌ లైసెన్సులు ఇవ్వడానికి ప్రతిగా ఆమ్‌ ఆద్మీ పార్టీకి సౌత్‌ గ్రూప్‌ వంద కోట్లు ముడుపులు చెల్లించిందని, ఇందులో కవితది కీలక పాత్ర అని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా 18 మందిని ఇప్పటి వరకూ ఈడీ అరెస్టు చేసింది.

Latest News