Naveen Patnaik | ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ చరిత్ర సృష్టిస్తారా?

లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కమలనాథులు పట్టుదలతో ఉన్నారు. జూన్‌ 1న ఆ రాష్ట్రంలో 6 లోక్‌సభ సీట్లతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది

  • Publish Date - May 29, 2024 / 04:55 PM IST

బరిలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నా.. బీజేపీ, బీజేడీ మధ్యే ప్రధాన పోటీ
గత ఎన్నికల్లో నవీన్‌ రికార్డు మెజారిటీ
ఈసారి ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ
లోకల్‌ సెంటిమెంట్‌ రెచ్చగొడుతున్న బీజేపీ

(విధాత ప్రత్యేకం)

లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కమలనాథులు పట్టుదలతో ఉన్నారు. జూన్‌ 1న ఆ రాష్ట్రంలో 6 లోక్‌సభ సీట్లతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. ఈ 42 అసెంబ్లీ సీట్లలో 27 జనరల్‌, 6 ఎస్టీ, 9 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ బీజూ జనతాదల్‌ (బీజేడీ), బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు పోటీలో ఉన్నా బీజేడీ, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ 24 ఏళ్లుగా పాలిస్తున్నారు. మూడోసారి బీజేడీ అధికారంలోకి వస్తే ఆయన దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ రికార్డును తిరగరాస్తారు.

గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 147 స్థానాలకు గాను 44.71 శాతం ఓట్లతో 114 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని విజయాన్ని సాధించిన నవీన్‌ పట్నాయక్‌ ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈసారి అక్కడ పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలన్నీ అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నాయని, అవి ఎన్నికల సమయంలో బైటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

క్షేత్రస్థాయిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళిని అంచనా వేస్తున్నవాళ్లు ఇప్పటికీ బీజేడీ బలంగానే ఉన్నదని చెబుతున్నారు. కార్యకర్తల బలం, ఎన్నికల యంత్రాంగాన్ని నడిపే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు బీజేడీకి సమీపంలో లేవు. కొన్నిచోట్ల గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ అయిన కాంగ్రెస్‌ అభ్యర్థులు వ్యక్తిగతంగా గెలుపు కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. చేస్తున్నారు. ఎవరైనా కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే అది ఆయన వ్యక్తిగత కృషిగానే భావించాలని అంటున్నారు.

అలాగే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతున్నది. ఆ పార్టీ 2000 -2009 మధ్య కాలంలో బీజేడీతో కలిసి అధికారాన్ని పంచుకున్నది. 2009 ఎన్నికలకు ముందు రెండు పార్టీలు విడిగా పోటీ చేశాయి. అప్పటి నుంచి బీజేపీ రాష్ట్రంలో మూడవ ప్రధాన రాజకీయశక్తిగా అవతరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 32.49 శాతం ఓట్లతో 23 స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నది. అలాగే ఉత్తరాదిలో తగ్గుతున్న లోక్‌సభ సీట్లను ఇక్కడ కొంత భర్తీ చేసుకోవాలనుకుంటున్నది.

21 లోక్‌సభ సీట్లలో గత ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ 8, కాంగ్రెస్‌ 1 చోట గెలిచాయి. బీజేపీ ఈసారి 17 స్థానాలను టార్గెట్‌ పెట్టుకున్నది. అందుకే మోదీ, షా అక్కడ లోకల్‌ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి ఒడిశా భాషలో ప్రావీణ్యం ఉన్న నేత, ఇక్కడి సంస్కృతి-సంప్రదాయాలను అర్థం చేసుకోగలిగే నేత ఈ రాష్ట్రానికి తదుపరి సీఎంగా వస్తారని ప్రచారం చేస్తున్నారు. మాజీ ఐఏఎస్‌ పాండ్యన్‌ (తమిళనాడు) నియంత్రణలో బీజేడీ ఉన్నదని ఆరోపిస్తూ ఒడిశా సీఎంపై బీజేపీ వీడియో విడుదల చేసింది. దీనిపై స్పందించిన నవీన్‌ పట్నాయక్‌ అసత్యాలు ప్రచారం చేసే బీజేపీ ఎత్తులు ఇక్కడ పారవని తిప్పికొట్టారు.

Latest News