Gold Mines In India | మన బంగారు గనులు..దేశానికి గేమ్-ఛేంజర్

దేశంలో కొత్తగా గుర్తించిన రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ బంగారు గనులు భారత్‌ బంగారం ఉత్పత్తిని పెంచి దిగుమతులను తగ్గించే గేమ్‌ ఛేంజర్‌గా నిలవనున్నాయి.

Gold mines in india

విధాత : దేశంలో ఇటీవల కొత్తగా గుర్తించిన బంగారు గనులు భారత దేశానికి గేమ్ ఛేంజర్ కాబోతున్నాయి. మన దేశ ప్రజలలో బంగారానికి అధిక డిమాండ్ ఉండటం.. ఇప్పటిదాక దేశీయంగా ఏటా 2-3 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుండటంతో క్కువ భాగం బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. తద్వారా విలువైన వీదేశీ మారకద్రవ్యం కోల్పోవాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు దేశీయ ఖనిజ ఉత్పత్తి సంస్థ జరిపిన అన్వేషనలో దేశంలో కొత్తగా గుర్తించబడిన బంగారు గనులు ఇప్పుడు దేశ ప్రజల బంగారం అవసరాలను తీర్చడంలో కీలకం కాబోతున్నాయి.

రాజస్థాన్..ఏపీ, ఎంపీ బంగారు గనులు కీలకం

కొత్తగా రాజస్థాన్ లోని బన్స్వారాలోని భూకియా-జగ్‌పురా, కంకారియా-గారా ప్రాంతాల్లో గుర్తించిన రెండు బంగారు గనులు, ఏపీలోని జొన్నగిరిలో గుర్తించిన బంగారు గనులు దేశీయ బంగారం అవసరాలను తీర్చడంలో, భారత్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలకం కాబోతున్నాయి. బన్స్వారా జిల్లాలోని భూకియా-జగ్‌పురా బంగారు గనిలో దేశంలోని 25శాతం బంగారం డిమాండ్ అవసరాలను తీర్చనుండటంతో మైనింగ్ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచనుందని మైనింగ్ నిపుణులు చెబుతున్నారు. 940.26 హెక్టార్ల విస్తీర్ణంలోని ఈ అతిపెద్ద బంగారు గనిలో 113.52 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు అంచనా వేశారు. దీని నుంచి మొత్తం 222.39 టన్నుల స్వచ్చమైన బంగారం వెలికితీయనున్నారు. కంకారియా గారా ప్రాంతంలోని 205 హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు గని నుంచి 1.24 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు గనుల నుంచి బంగారంతో పాటు మరికొన్ని రకాల ఖనిజాలను వెలికితీయబోతున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు.

జోన్నగిరి మరో స్వర్ణగని

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జొన్నగిరిలోని బంగారు గని నుండి నవంబర్ నుంచి బంగారు ఉత్పత్తి ప్రారంభం కానుంది గత 80 ఏళ్లలో దేశంలోనే ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో నడిచే తొలి బంగారు గని ఇది. ఈ గని ద్వారా మొదటి సంవత్సరంలో 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని క్రమేపి చివరి దశలో గని సంవత్సరానికి 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. రూ.320 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ కర్మాగారం 350 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. ఈ బంగారు గని కర్నూల్ జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ దీనిలో భాగస్వామిగా ఉంది.

పసిడి సిరి కోలారి గోల్డ్ మైన్

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలోని సిహోరా తెహసిల్‌లోని మహాగవాన్ కోలారి ప్రాంతంలో భారీ బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. 100 హెక్టార్లలో బంగారు నిల్వలున్నాయని గుర్తించింది. జబల్పూర్ జిల్లా బంగారు గని రాష్ట్ర మైనింగ్ చరిత్రలో కొత్త అధ్యాయనం అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం బంగారు నిల్వలు దాదాపు 879.58 మెట్రిక్ టన్నులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువ భాగం కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా కర్ణాటక కొనసాగుతుంది.