దేశ జనాభాలో మోదీకి ఓటేసింది … ఆరు శాతమే

ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అంటే ఇదేనేమో! అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్రమోదీని బీజేపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తుంటారు. మోదీ సైతం తాను దైవాంశ సంభూతుడినని, కారణజన్ముడనని చెప్పుకొన్నారు.

  • Publish Date - July 3, 2024 / 04:59 AM IST

దేశ జనాభా 142,57,75,850
మొత్తం రిజిస్టర్డ్‌ ఓటర్లు 96,88,21,926 మంది
లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు 63,73,87,945
మోదీకి వచ్చిన ఓట్లు 23,59,73,935
పోలైన ఓట్లలో మోదీకి వచ్చినవి 36.5%.
మొత్తం ఓటర్లలో మోదీకి లభించిన మద్దతు 24.3 %
అంటే.. దేశ జనాభాలో మోదీకి ఓటేసింది ఆరుశాతమే!
(విధాత ప్రత్యేకం)

ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అంటే ఇదేనేమో! అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్రమోదీని బీజేపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తుంటారు. మోదీ సైతం తాను దైవాంశ సంభూతుడినని, కారణజన్ముడనని చెప్పుకొన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ఆయన మంగళవారం సమాధానం ఇస్తూ కూడా తమకు సీట్లు తగ్గిన విషయాన్ని చెప్పకుండా.. పదేళ్ల తమ పరిపాలనను చూసి ప్రజలు మూడోసారి పట్టంగట్టారని గొప్పగా చాటుకున్నారు. తాను సైతం భాగస్వామ్య పక్షాల ఓట్ల ఆధారంగా కొన్ని సీట్లు గెలుచుకున్నా.. భాగస్వామ్య పార్టీల ఓట్ల ఆధారంగా కాంగ్రెస్‌ సీట్లు పెంచుకున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పరాన్నజీవి పార్టీ అని ఎకసెకాలాడారు.

ఎదురుదెబ్బలు ఊహించే మళ్లీ ఎన్డీయే ముచ్చట!

వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీకి తగిలే ఎదురుదెబ్బలపై అవగాహనకు వచ్చే మోదీ తన పాత భాగస్వాములను దగ్గరకు తీశారనే అభిప్రాయాలు ఉన్నాయి. అప్పటిదాకా పట్టించుకోని, పేరుకు ఎన్డీయే పక్షాలుగా ఉన్నవారిని దగ్గరకు తీసి, వారికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టారని పలువురు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఇండియా కూటమి వ్యవస్థాపకుడైన బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ను మరోసారి పల్టీ కొట్టించి ఎన్డీయేలో కలుపుకొన్నా.. చివరి నిమిషంలో ఏపీలో బలవంతంగా టీడీపీ, జనసేన కూటమిలోకి వెళ్లినా, అంతకు ముందే మహారాష్ట్రలో శివసేనను, ఎన్సీపీని చీల్చి.. ఈ చీలిక గ్రూపులతో కలిసి ప్రభుత్వంలోకి వచ్చినా అంతా ముందుజాగ్రత్త చర్యలేననే అభిప్రాయాలు ఉన్నాయి. ఉత్తరాదిలో భారీగా సీట్లు తగ్గబోతున్నాయని అర్థమయ్యే మోదీ, షా దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు పక్కా ప్లాన్‌ ప్రకారం ప్రయత్నాలు చేశారని, ఆ క్రమంలోనే కర్ణాటక, తెలంగాణలో కొన్ని సీట్లు గెలవగలిగారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవి లేకపోతే మోదీ 3.0 వాస్తవరూపం దాల్చేదే కాదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మోదీని ప్రజాదరణ కలిగిన నేతగా ఎలా చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మోదీ ప్రజాదరణ కలిగిన నాయకుడేనా

మోదీ ప్రజాదరణ గురించి మాట్లాడితే పంచపాండవులు.. మంచం కోట్లు సామెత గుర్తుకు వస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో మోదీకి లేదా ఆయన పార్టీకి ఓటేసిన వారు ఎంతమందో తెలిస్తే.. ఈ ‘ప్రజాదరణ’ బెలూన్‌ ఠప్‌మని బద్దలైపోతుందని అంటున్నారు. భారతదేశ జనాభా 142,57,75,850. దేశంలోని మొత్తం రిజిస్టర్డ్‌ ఓటర్లు 96,88,21,926 మంది. 18వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 63,73,87,945 ఓట్లు పోలైతే.. మోదీకి లేదా మోదీ బొమ్మ పెట్టుకున్న బీజేపీకి వచ్చిన ఓట్లు 23,59,73,935. పోలైన ఓట్లలో మోదీకి వచ్చినవి 36.5%.
మొత్తం ఓటర్లలో మోదీకి లభించిన మద్దతు 24.3 %. దీన్ని మొత్తం జనాభాతో పోల్చి చూసుకుంటే.. మోదీకి ఓటేసినవారు కేవలం ఆరుశాతమేనని విశ్లేషిస్తున్నారు. కేవలం ఆరు శాతం మంది దేశ జనాభా ఓటేసిన నేత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎలా అవుతారన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Latest News