Site icon vidhaatha

Operation Sindoor | ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు రోజు ఐఎస్‌ఐతో టచ్‌లో జ్యోతి మల్హోత్రా?

Operation Sindoor | పహల్గామ్‌ దాడి నేపథ్యంలో పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న స్పై వ్లాగర్‌ జ్యోతి మల్హోత్రా విషయంలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పహల్గామ్‌లో భీకర దాడికి మూడు నెలలు ముందు జ్యోతి మల్హోత్రా పహల్గామ్‌ను సందర్శించినట్టు న్యూస్‌ 18 పేర్కొన్నది. ఈ కేసులో ఇప్పటికే జ్యోతి మల్హోత్రాపై అధికార రహస్యాల చట్టంలోని 3, 4, 5 సెక్షన్లతోపాటు.. భారతీయ న్యాయ సంహితలోని 152వ చట్టం కింద అభియోగాలు నమోదయ్యాయి. సదరు యూట్యూబర్‌.. ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభానికి సరిగ్గా ఒక రోజు ముందు అంటే మే 6వ తేదీన పాకిస్తాన్‌ హైకమిషన్‌లో పనిచేసే తన హ్యాండ్లర్‌ డానిష్‌తో టచ్‌లో ఉన్నట్టు తేలిందని అధికారవర్గాలను ఉటంకిస్తూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. తాజా సంగతులు బయటపడుతున్న నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ మాజీ డీజీపీ శేష్‌పాల్‌ వైద్‌ ఎక్స్‌లో పలు కీలక ప్రశ్నలు సంధించారు. జ్యోతి మల్హోత్రా 2025 జనవరిలో పహల్గామ్‌ సందర్శనకు వెళ్లడం యాదృచ్ఛికమేనా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె కొద్దికాలానికే పాకిస్తాన్‌ వెళ్లింది. పహల్గామ్‌ దాడికి ముందు అది మొత్తంగా నాలుగో సందర్శన అని ఆయన తెలిపారు.

పాకిస్తానీ హైకమిషన్‌లో పనిచేసే ఎహసాన్‌ ఉర్‌ రహీం ఆమెను హనీట్రాప్‌లో పడేశారని తెలుస్తున్నది. అతడిని జ్యోతి మల్హోత్రా డానిష్‌జీ అని సంబోధించేది. 2023లో వారు తొలిసారి కలుసుకున్నారు. బాలి, ఇండోనేషియా దేశాలకు కూడా వెళ్లొచ్చారు. గూఢచర్య కింద డానిష్‌ను పర్సొనా నాన్‌ గ్రాటాగా మే 13న ప్రకటించింది. ఇది స్పానిష్‌ పదం. దీని అర్థం.. ఆమోదించబడని వ్యక్తి అని. వాస్తవానికి జ్యోతి మల్హోత్రాను ఐఎస్‌ఐ హ్యాండ్లర్స్‌కు పరిచయం చేసిందే డానిష్‌. ఐఎస్‌ఐ ఆపరేటివ్స్‌లో షకీర్‌ అలిసా రాణా షెహబాజ్‌ అనే వ్యక్తితో జ్యోతి సన్నిహితంగా ఉండేది. అతడి నంబర్‌ను తన ఫోన్‌ కాంటాక్ట్స్‌లో జాట్‌ రాంధ్వానా అని ఫీడ్‌ చేసుకుంది. వాట్సాప్‌, టెలిగ్రామ్‌, స్నాప్‌చాట్‌ వంటి ఎన్‌క్రిప్టెడ్‌ యాప్స్‌ ద్వారా వారికి ఆమె సమాచారం షేర్‌ చేసేదని తెలుస్తున్నది. 2024 సెప్టెంబర్‌లో ఒడిశాలోని పూరీలో పరిచయం అయిన మరొక ఫిమేల్‌ యూట్యూబర్‌తో కూడా ఆమె టచ్‌లో ఉండేదని తెలుస్తున్నది. ఒడిశాకు చెందిన ఆ మహిళ కూడా కార్తాపూర్‌ కారిడార్‌ ద్వారా పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చింది.
ఈ కేసులో జ్యోతితో పాటు మొత్తం పది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేశారు. వీరిలో ఇటీవల పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి అరెస్టయినవారు కూడా ఉన్నారు. పంజాబ్‌లో అరెస్టయిన సుఖ్‌ప్రీత్‌ సింగ్‌, కర్ణబీర్‌ సింగ్‌.. దళాల కదలికలు, వ్యూహాత్మక ప్రాంతాలు సహా ఆపరేషన్‌ సిందూర్‌పై రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశారు. హర్యానాలో అర్మాన్‌ అనే వ్యక్తిని నుహ్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అతడు పాకిస్తానీ నంబర్లకు ఫొటోలు, వీడియోలు పంపినట్టు గుర్తించారు.

Exit mobile version