Train hits School Bus | చెన్నై : తమిళనాడు( Tamil Nadu )లోని కడలూరు( Cuddalore )లో ఘోర ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు( School Bus )ను రైలు( Train ) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
కడలూరు, అలప్పక్కం మధ్య ఉన్న రైల్వే గేట్ వద్ద మంగళవారం ఉదయం 7.45 గంటలకు ఓ స్కూల్ బస్సు ట్రాక్ దాటుతుండగా, వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది. దీంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. ఇద్దరు పిల్లలు చనిపోయారు. పలువురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనని అధికారులు నిర్ధారించారు. రైల్వే గేటు వద్ద పని చేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ప్యాసింజర్ రైలు వచ్చినప్పుడు గేట్ వేయకుండా, తెరిచి ఉంచడంతో స్కూల్ బస్సు ట్రాక్‌ను దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు రైల్వే అధికారులు.