Site icon vidhaatha

PM Modi | వెండి చెంచాతో పుట్టిన వారికి కష్టం విలువ తెలియదు: మోదీ

విధాత: ఇండియా కూటమికి జూన్‌ 4న గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని ప్రధాని మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌లోని తూర్పు చంపారన్‌లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ , ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌లపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వెండి చెంచాతో పుట్టిన వారికి కష్టం విలువ ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి పాపాలతో దేశం ముందుకు సాగదని చెప్పారు. అంబేద్కర్‌ లేకుంటే మాజీ ప్రధాని నెహ్రూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే వారు కాదన్నారు.

బీజేపీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు విమర్శించడంపై మోడీ ధీటుగా బదులిచ్చారు. స్విస్‌ బ్యాంకుల్లో నోట్ల కట్టలు ఉన్నవారికి సామాన్యుల పరిస్థితి అర్థం కాదని, పేద కుటుంబంలో పుట్టిన తనకు తెలుసు అన్నారు. కాంగ్రెస్‌, ఆ పార్టీ మిత్రపక్షాలు కలిసి దేశాన్ని 60 ఏళ్లు నాశనం చేశాయి. 3 నుంచి 4 తరాల జీవితాలను నాశనం చేశాయి. పేదవాడు మరింత పేదవాడయ్యాడు. ఈ 60 ఏళ్లలో కాంగ్రెస్‌ పెద్ద పెద్ద రాజభవనాలను నిర్మించుకున్నది.

స్విస్‌ బ్యాంకులో ఖాతా తెరిచింది. కానీ ప్రజల కడుపు నిండటానికి అన్నం లేదు. వెండి చెంచాతో పుట్టిన వారికి కష్టం అంటే తెలియదని దుయ్యబట్టారు. తాను ఒకటి విన్నానని, కొందరు జూన్‌ 4 తర్వాత మోదీ బెడ్‌ రెస్ట్‌ తీసుకుంటారని అక్కడక్కడ తిరిగి ప్రచారం చేస్తున్నారు. నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మోదీకే కాదు దేశంలోని ఏ పౌరుడికి కూడా బెడ్‌ రెస్ట్‌ రావొద్దని కోరుకుంటున్నాను. దేశంలోని ప్రతి పౌరుడు శక్తి కలిగి ఉండి బాగా జీవించాలని అన్నారు.

Exit mobile version