PM Modi | మోదీ.. ముస్లింలనుద్దేశించి ఆ మాట అనలేదట!

‘అధిక సంతానం ఉన్నవారు’, ‘చొరబాటుదారులు’ అని తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దానికి తెలివైన, సుదీర్ఘ వివరణ ఇచ్చారు

  • Publish Date - May 15, 2024 / 05:15 PM IST

అధిక సంతానం ఉన్నవారు అంటే.. పేదలేనట
ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారట!
న్యూస్‌ 18 ఇంటర్వ్యూలో మోదీ సుదీర్ఘ వివరణ
ఇంత ఆలస్యం ఎందుకైందన్న అసదుద్దీన్‌
ఇచ్చిన వివరణ కూడా తప్పుడుదని విమర్శ

న్యూఢిల్లీ : ‘అధిక సంతానం ఉన్నవారు’, ‘చొరబాటుదారులు’ అని తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దానికి తెలివైన, సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అనేది ముస్లింలనుద్దేశించి కాదని, పేద కుటుంబాలవారని మోదీ చెప్పారు. హిందూ, ముస్లిం పేరిట రాజకీయాలు చేస్తే తన ప్రజా జీవితానికి విలువలేదనీ అన్నారు. తాను ఓటు బ్యాంకు కోసం పనిచేయనని, సబ్‌ కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ అనేదాన్నే తాను నమ్ముతానని న్యూస్‌ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొన్నారు.

‘నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. అధిక సంతానం ఉన్నవారు అంటే అది ముస్లింల గురించేనని మీకు ఎవరు చెప్పారు? ముస్లింల పట్ల అంత అన్యాయంగా ఎలా మాట్లాడుతున్నారు? అటువంటి పరిస్థితి పేద కుటుంబాల్లోనూ ఉంటుంది. దీనికి సామాజిక వర్గాలతో నిమిత్తం లేదు. నేను హిందువులు అనిగానీ, ముస్లింలు అనిగానీ చెప్పలేదు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను. మీ పిల్లల బాధ్యత ప్రభుత్వం చూసుకునే పరిస్థితిని తెచ్చుకోవద్దని అన్నాను’ అని మోదీ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ముస్లింలు మీకు ఓటేస్తారా? అన్న ప్రశ్నకు.. ‘ఈ దేశ ప్రజలు నాకు ఓటేస్తారు.. అని బదులిచ్చారు. ‘హిందూ ముస్లిం రాజకీయాలు చేసిన రోజు.. ప్రజా జీవితంలో ఉండటానికి నాకు అర్హత లేదు. నేను ఆ పని చేయను. ఇది నా ప్రతిన’ అని సమాధానం చెప్పారు.

అయితే.. మోదీ వివరణను ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ తప్పుపట్టారు. చొరబాటుదారులు, అధిక సంతానం ఉన్నవారు అనే వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి అందులోనూ తప్పుడు వివరణ ఇవ్వడానికి మోదీకి ఇంత సమయం ఎందుకు పట్టిందని నిలదీశారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముస్లింలకు వ్యతిరేకంగా మోదీతోపాటు బీజేపీ పెద్ద ఎత్తున అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని ఒవైసీ విమర్శించారు. మోదీ తన ప్రసంగంలో ముస్లింలను చొరబాటుదారులు, అధిక సంతానం ఉన్నవారు అని అన్నారు. ఇప్పుడు తాను ఆ మాట ముస్లింల గురించి చెప్పలేదని, తాను హిందూ, ముస్లిం కోణంలో మాట్లాడలేదని అంటున్నారు. మరి మోదీకి ఈ వివరణ ఇవ్వడానికి ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు పట్టింది? మోదీ రాజకీయ ప్రయాణం మొత్తం ముస్లిం వ్యతిరేక రాజకీయాలపైనే పూర్తిగా ఆధారపడింది’ అని అసదుద్దీన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

నిజానికి 2002లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి మోదీ ప్రసంగాల్లో ముస్లిం వ్యతిరేకత, ముస్లింలను అవమానకరంగా మాట్లాడటం ఉంటున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్‌ మత ఘర్షణల అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మోదీ.. సహాయ పునరావాల శిబిరాలను ‘పిల్లల్ని పుట్టించే ఫ్యాక్టరీలు’ అని విమర్శించారు. బహుభార్యాత్వం ఉంటుందంటూ ‘ హమ్‌ పాంచ్‌.. హమారా పచ్చీస్‌ (మేం ఐదుగురం.. మాకు పాతిక మంది) అంటూ విమర్శలు చేశారు. అంతకు ముందు 2001లో బీజేపీ ప్రధాన కార్యదర్శి హోదాలో టీవీలో మాట్లాడిన మోదీ.. మతపరమైన ఆధిపత్యం కోసం ముస్లింలు, ముస్లిం నేతలు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు.

మరి ఇప్పుడు ఎందుకు ఇంత వివరణలు ఇచ్చుకుంటున్నారు? మోదీ చేసిన వ్యాఖ్యలు ఇటు దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అది తన విశ్వగురు భావనకు చేటు చేసేదిగా ఉండటంతోనే మోదీ ఇప్పుడు రాజకీయ వ్యూహంతోనే ఒక అడుగు వెనక్కు వేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముస్లింలను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్న భాష.. విశ్వగురు అని చెప్పుకొనే మోదీ ప్రతిష్ఠకు భిన్నంగా ఉన్నదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలు బూమర్యాంగ్‌ అయ్యాయని, కొందరు ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా మారారని, అందుకే ఆయన ఈ వివరణ ఇచ్చుకుని ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.

Latest News