Site icon vidhaatha

PM Modi | బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలి సంతకం కిసాన్ నిధుల విడుదలపైనే

9.30కోట్ల మంది రైతులకు 20వేల కోట్ల విడుదల

విధాత : భారత ప్రధానిగా నరేంద్రమోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌ పీఎంఓ కార్యాలయంలో మూడో దఫా దేశ ప్రధానిగా తన బాధ్యతలు మొదలుపెట్టేశారు. రైతులకు సంబంధించిన పీఎం కిసాన్ నిధు విడుదల దస్త్రంపై ప్రధాని మోదీ తన తొలి సంతకం చేశారు. దీంతో 9.30 కోట్లమంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం విడుదలైంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం వారి సంక్షేమానికి సంబంధించినదే కావడం విశేషమన్నారు.

రాబోయే రోజుల్లో వ్యవసాయరంగానికి, కర్షకుల సంక్షేమంపై మా ప్రభుత్వం మరింత దృష్టి సారించనుందని మోదీ వెల్లడించారు. కాగా సాయంత్రం మోదీ కేబినెట్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్లమెంటు ఉభయ సభలను సమావేశ పరుచాలని కేబినెట్ రాష్ట్రపతిని కోరనుంది. అలాగే ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని దాదాపు 50 శాతం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ జరగబోయే సమావేశాల ప్రారంభం రోజున రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలను, లక్ష్యాలను వివరిస్తారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధించడంతో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. జవహర్ లాల్‌ నెహ్రూ తర్వాత దేశంలో వరసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను మోదీ సొంతం చేసుకున్నారు

Exit mobile version