PRASANTH KISHORE । దేశ సంపదనంతా గుజరాత్‌కు తరలించేశారు.. : మోదీపై పీకే నిప్పులు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై జన్‌ సూరజ్‌ పార్టీ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగాలు విని, గుజరాత్‌ నమూనాను చూసి ఆయనకు ఓటేస్తే.. దేశంలోని సంపదనంతా గుజరాత్‌కు తరలించుకుపోయారని విమర్శించారు.

PRASANTH KISHORE । గుజరాత్‌ ట్రాక్‌ రికార్డును చూసి మెచ్చిన ప్రజలు మోదీనికి గెలిపిస్తే.. ఆయన దేశం యావత్తు సంపదను తన సొంత రాష్ట్రానికి తరలించుకున్నరని జన్‌ సూరజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ విమర్శించారు. బుధవారం పాట్నాలో జన్‌ సూరజ్‌ పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధానిపై నిప్పులు చెరిగారు. ‘మీలాంటోళ్లు, నాలాంటోళ్లు ఆయన ఉపన్యాసాలు విని, గుజరాత్‌లో ఆయన చేసిన అభివృద్ధికి మెచ్చి ఓటేశాం. నిజానికి గుజరాత్‌ ప్రగతి సాధిస్తున్నది. యావత్‌ దేశ సంపదను మొత్తం గుజరాత్‌కు తరలించేశారు. అక్కడ ప్రతి ఒక్క గ్రామంలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. బీహార్‌ ప్రజలు ఉద్యోగాల కోసం గుజరాత్‌ వెళుతున్నారు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. గుజరాత్‌ అభివృద్ధి కోసం ఓటేస్తే బీహార్‌ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.

జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. గత మూడు దశాబ్దాలుగా ఈ ఇద్దరు నాయకులే రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నరని అన్నారు. ‘సామాజిక న్యాయం, పేదలకు గౌరవం పేరుతో మీరు లాలూజీకి ఓటేశారు. ఆయన హయాంలో  పేదలు ఆత్మగౌరవంతో జీవించారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ.. శాంతి భద్రతలు కుప్పకూలాయి. ఆర్థిక ప్రగతి కుంటుపడింది’ అని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. మంచి రోడ్లు, మెరుగైన విద్యుత్తు సరఫరా కోసం నితీశ్‌కు ఓటేస్తే.. ఆయనా వాటిపై పనిచేశారు. అంతేకాదు.. ప్రిపెయిడ్‌ మీటర్లు పెట్టాలన్న ఆయన కోరిక విద్యుత్తు వినియోగదారుల వెన్ను విరుస్తున్నది’ అని అన్నారు. ‘ఈ రోజు ఐదు కేజీల రేషన్‌ కోసం ప్రజలు మోదీకి ఓటేశారు. అవినీతి కారణంగా ఒక కిలో కోత పడినా అందరికీ రేషన్‌ అందుతున్నది. కానీ.. నేను బీహార్‌లో విస్తృతంగా పర్యటించినప్పుడు ఏనాడూ తమ పిల్లల మెరుగైన భవితవ్యం కోసం ఓటు వేయలేదని నాకు తెలిసింది. ఈ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రజలకు వివరించి చెప్పేందుకు చేపట్టిన జన్‌ సూరజ్‌ క్యాంపెయిన్‌.. ఇప్పుడు రాజకీయ పార్టీగా మారింది. మీ పిల్లల కోసం ఓటేయండి.. మెరుగైన విద్య, ఉపాధి అవకాశాల కోసం ఓటేయండి. మీరు మార్పును చూస్తారు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు.