President Draupadi Murmu | పేపర్‌ లీకేజీలపై కఠిన చర్యలు.. ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం: ఉభయసభలనుద్దేశించి ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పోటీ పరీక్షల్లో అవకతవకలు, రాజ్యాంగం మార్పునకు ప్రయత్నాలు, మణిపూర్‌ హింస వంటి అంశాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పుకొనేందుకు, ఆయా అంశాలపై తన వైఖరిని సమర్థించుకునేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగాన్ని పూర్తిగా వినియోగించుకున్నది

  • Publish Date - June 27, 2024 / 02:58 PM IST

న్యూఢిల్లీ : పోటీ పరీక్షల్లో అవకతవకలు, రాజ్యాంగం మార్పునకు ప్రయత్నాలు, మణిపూర్‌ హింస వంటి అంశాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పుకొనేందుకు, ఆయా అంశాలపై తన వైఖరిని సమర్థించుకునేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగాన్ని పూర్తిగా వినియోగించుకున్నది. గురువారం ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగాలను కేంద్ర క్యాబినెట్‌ రూపొందిస్తుందనే సంగతి తెలిసిందే. ప్రభుత్వం రాసిచ్చినది తప్ప ఇతర అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో సహజంగా ఉండవు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి నోటి నుంచి తన మాటలను ప్రభుత్వం పలికించింది. భవిష్యత్తులో పేపర్‌ లీకేజీలు జరుగకుండా తన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో తెలిపారు.

‘ఈ దేశ యువత తమ ప్రతిభను చాటుకునేందుకు సరైన అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుంది. అది పోటీ పరీక్షలు కావచ్చు.. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు కావచ్చు.. ఎలాంటి ఆటంకాలకు తావు ఉండరాదు. ఈ ప్రక్రియకు పూర్తి పాదర్శకత, నిజాయతీ అవసరం’ అని ముర్ము చెప్పారు. ఇటీవల కొన్ని పరీక్ష పత్రాల లీకేజీలపై స్పందిస్తూ.. వాటిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు, దోషులను కఠినంగా శిక్షించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. గతంలో కూడా అనేక రాష్ట్రాల్లో పేపర్‌ లీకేజీలు చోటు చేసుకున్నాయని ఆమె గుర్తు చేశారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. పరీక్షల్లో అవకతవకలను నివారించేందుకు పార్లమెంటు కూడా కఠినమైన చట్టాన్ని రూపొందించిందన్నారు. పరీక్షల నిర్వహణ సంస్థల పనితీరు, పరీక్షల ప్రక్రియకు సంబంధించి అన్ని అంశాల్లో భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు తన ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిని ఇబ్బంది పెట్టేలా.. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ అంశాన్ని ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. అదే సమయంలో రాజ్యాంగాన్ని బీజేపీ మార్చివేస్తుందన్న ప్రతిపక్షాల విమర్శలకు సైతం మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగంలో కౌంటర్‌ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ‘దేశ రాజ్యాంగం గడిచిన దశాబ్దాల్లో అనేక సవాళ్లను, పరీక్షలను తట్టుకుని నిలబడింది. రాజ్యాంగం అమ్లలోకి వచ్చిన తర్వాత దానిపై అనేకసార్లు దాడులు జరిగాయి. 1975 జూన్‌ 25న విధించిన ఎమర్జెన్సీ రాజ్యాంగంపై నేరుగా జరిగిన దాడిలో అతిపెద్ద, చీకటి అధ్యాయం. యావత్‌ దేశం ఘోర అవమానంగా భావించింది. భారతదేశ మూల స్వభావంలోనే గణతంత్ర సంప్రదాయాలు ఉండటంతో అటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై దేశం విజయం సాధించింది’ అని ముర్ము చెప్పారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఒక పాలనాపరమైన మాధ్యమంగా చూడటం లేదని, ప్రజా చైతన్యంలో దాన్ని ఒక భాగం చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నదని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.

ఈ అంశాన్ని గమనంలో ఉంచుకునే తన ప్రభుత్వం నవంబర్‌ 26ను రాజ్యాంగ దినోత్సంగా ఉత్సవాలు చేస్తున్నదని చెప్పారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో ఇప్పుడు రాజ్యాంగం యావత్‌ దేశంలో అమల్లోకి వచ్చిందని అన్నారు. మణిపూర్‌లో హింసను ప్రస్తావించిన రాష్ట్రపతి ప్రసంగం.. అక్కడ శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. ‘ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు నా ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తున్నది. గత పదేళ్లలో అనేక పాత వివాదాలు పరిష్కృతమయ్యాయి. అనేక ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. కల్లోలిత ప్రాంతాల నుంచి సాయుధ దళాల విచక్షాణాధికారాల చట్టాన్ని దశలవారీగా ఉపసంహరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతమయ్యాయి. బడ్జెట్‌లో ఈశాన్య రాష్ట్రాలకు కేటాయింపులు నాలుగింతలు పెరిగాయి’ అని ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు తన ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాష్ట్రపతి చెప్పినప్పుడు ప్రతిపక్షాలు మణిపూర్‌ నినాదాలు చేశాయి.

Latest News