మంగళసూత్రం విలువ మోడీకి ఏం తెలుసు?

ప్రధాని రాజస్థాన్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. ' ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చెప్పింది

  • Publish Date - April 24, 2024 / 10:50 AM IST

దేశం కోసం తన తల్లి మంగళ సూత్రాన్ని త్యాగం చేసింది
యుద్ధ సమయంలో తన నానమ్మ సొంత బంగారాన్ని దేశం కోసం ఇచ్చింది
ఎన్నికల సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను జైళ్లో పెట్టిన ఘటనలు ఎప్పుడూ చూడలేదు
మహిళలను బెదరగొట్టి ఓట్లు రాబట్టుకోవాలనుకుంటున్న మోడీ సిగ్గుపడాలి
బెంగళూరులో ప్రధానిపై నిప్పులు చెరిగిన ప్రియాంకగాంధీ

ప్రధాని రాజస్థాన్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకే దేశ సంపదంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవాళ్లకు పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉన్నదా? అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలనూ వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలవడం మీకు సమ్మతమేనా? అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు.

దీనికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మంగళసూత్రం విలువ తెలియకుండా ప్రధాని కాంగ్రెస్‌ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం బెంగళూరులో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడుతూ.. తన తండ్రి రాజీవ్‌గాంధీ హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ..దేశం కోసం తన తల్లి సోనియాగాంధీ మంగళసూత్రాన్ని త్యాగం చేశారు. యుద్ధ సమయంలో తన నానమ్మ ఇందిరాగాంధీ సొంత బంగారాన్ని దేశం కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దేశాన్ని 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ ఎప్పుడైనా ప్రజల బంగారాన్ని మంగళసూత్రాలను దోచుకున్నదా? అని ప్రశ్నించారు.

ప్రధాని విలువలు మరిచి నాటకాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఏం మాట్లాడుతున్నారు? ప్రధానికి మంగళసూత్రం విలువ తెలిసి ఉంటే ఇలా అనైతికంగా మాట్లాడేవారా? దేశంలో అన్ని సంప్రదయాలకూ మహిళల సేవా స్పూర్తే పునాది. అవసరమైతే తాను పస్తు ఉంటుందే గాని కుటుంబంలో ఎవరినీ ఆకలితో పడుకోనివ్వదు. ఇంట్లో అందరూ నిద్రపోయాక విశ్రమించేది గృహిణి. కుటుంబానికి కష్టం వస్తే నగలను ఆమె తాకట్టు పెడుతుంది. వాళ్ల త్యాగాల విలువ వీళ్లకేం తెలుసు? ప్రపంచానికి నాయకుడిగా ప్రకటించుకునే నేత విలువలు మరిచి నాటకాలాడుతున్నారు. దేశ చరిత్రలో ఎన్నికల ముందు ఇద్దరు సీఎంలను జైళ్లకు పంపిన ఘటనలను మనం చూడలేదు. వాస్తవాలు ప్రశ్నించిన వారికి ప్రస్తుతం ఇదే గతి పడుతున్నదని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్ని బెదరగొట్టి ఓట్లు రాబట్టకునేలా మాట్లాడుతున్నందుకు మోడీ సిగ్గుపడాలన్నారు. నైతికత-నాటకీయత, అధికారం -నిజాయితీ, పరోపకారం-అహంకారం.. వీటిలో ఏం కావాలో తేల్చుకోవాలని ప్రజల్ని కోరారు.

Latest News