Site icon vidhaatha

Rahul Gandhi | రాయ్‌బరేలీ! వాయనాడ్‌! రాహుల్‌ దేన్ని వదులుకుంటారు?

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన సిటింగ్‌ స్థానం కేరళలోని వాయనాడ్‌తోపాటు.. తన తల్లి ప్రాతినిథ్యం వహించిన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి.. రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. అయితే.. అనివార్యంగా ఆయన ఈ రెండింటిలో ఏదో ఒకటి వదులుకోవాల్సిందే. తనను ఎంపీగా గెలిపించిన రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ప్రజలను నిరుత్సాహపర్చాల్సిందే. వాయనాడ్‌లో సీపీఐ అభ్యర్థి అన్నే రాజాపై 3.64వేలకుపైగా భారీ ఓట్ల మెజార్టీతో రాహుల్‌ విజయం సాధించారు.

రాయ్‌బరేలీలో కూడా బీజేపీ అభ్యర్థి దినేశ్‌ ప్రతాప్‌సింగ్‌పై 3.90 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో వాయనాడ్‌లో 4.31 లక్షల భారీ మెజార్టీ సాధించారు. ఆ సమయంలో అమేథీ నుంచి కూడా పోటీ చేసినా.. అక్కడ ఓటమి నేపథ్యంలో సమస్య రాలేదు. అయితే.. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒక దానికి ఆయన రాజీనామా చేయక తప్పదు. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించేందుకు ఏ సీటును ఎంచుకుంటారన్న ప్రశ్నకు రాహుల్‌ సమాధానం చెప్పలేదు. ‘నేను రెండు సీట్ల నుంచి గెలిచాను. రాయ్‌బరేలీ, వాయనాడ్‌ ఓటర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. దానిపై చర్చించి, నిర్ణయం తీసుకుంటాను. రెండింటిలో కొనసాగలేను కదా.. కాబట్టి.. ఇంకా నేనేమీ నిర్ణయించుకోలేదు’ అని ఆయన బదులిచ్చారు. ‘వాయనాడ్‌ ఎంపీగా ఉంటారా? రాయ్‌బరేలీ ఎంపీగా ఉంటారా? అని నన్ను అడుగుతున్నారు. ఆ రెండింటికీ ఎంపీగా ఉండాలని ఉన్నది’ అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

దాదాపు 30 ఏళ్లుగా రాయ్‌బరేలీ ఎంపీగా ఉండి.. రాజ్యసభకు వెళ్లిన సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. మే 17న రాయ్‌బరేలీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో భావోద్వేగంతో మాట్లాడిన సోనియాగాంధీ.. తన కుమారుడిని నియోజకవర్గ ఓటర్లు అప్పగిస్తున్నానని, ఆయన మిమ్మల్ని నిరుత్సాహపర్చబోడని అన్నారు. దీన్ని గమనిస్తే.. రాహుల్‌ రాయ్‌బరేలీ నియోజకవర్గాన్నే ఎంచుకుని, వాయనాడ్‌కు రాజీనామా చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రియాంక పోటీ చేస్తారా?

రెండింటిలో ఒక దానికి రాహుల్‌ రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఆ సమయంలో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన తల్లి, సోదరుడు ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలను ప్రియాంక గాంధీయే పర్యవేక్షిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానంలో ప్రియాంకను రాయ్‌బరేలీ ప్రజలు అంగీకరిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అదే సమయంలో రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లోని నియోజకవర్గం కనుక రాయ్‌బరేలీని ఉంచుకుని, వాయనాడ్‌కు రాజీనామా చేస్తారనే వాదనలూ ఉన్నాయి. రాయ్‌బరేలీలో గెలిస్తే వాయనాడ్‌ను రాహుల్ వదిలేస్తారని బీజేపీ, వామపక్షాలు ఎన్నికల ప్రచారం సందర్భంగా విమర్శించిన విషయం తెలిసిందే.

 

Exit mobile version