BREAKING NEWS । వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి …రాహుల్‌ గాంధీ రాజీనామా

వాయనాడ్‌, రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. అందరూ ఊహించినట్టుగానే రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగనున్నారు. వాయనాడ్‌కు రాహుల్‌ రాజీనామా చేస్తారని, అక్కడ ఉప ఎన్నికలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం సాయంత్రం ప్రకటించారు.

  • Publish Date - June 17, 2024 / 07:49 PM IST

న్యూఢిల్లీ : వాయనాడ్‌, రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. అందరూ ఊహించినట్టుగానే రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగనున్నారు. వాయనాడ్‌కు రాహుల్‌ రాజీనామా చేస్తారని, అక్కడ ఉప ఎన్నికలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం సాయంత్రం ప్రకటించారు. అంతకు ముందు ఢిల్లీలోని ఖర్గే నివాసంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మరో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహల్‌ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగానే కొనసాగాలని నిర్ణయించారు. వాయనాడ్‌ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రాహుల్‌గాంధీ ఏ స్థానంలో కొనసాగుతారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

కాంగ్రెస్‌కు వాయనాడ్‌ బలమున్న నియోజకవర్గం కావడంతో గత ఎన్నికల్లో రాహుల్ అమేథీతోపాటు.. ఇక్కడ కూడా పోటీ చేశారు. అమేథీలో ఓడిపోగా, వాయనాడ్‌లో విజయం సాధించారు. ఈసారి సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లడంతో రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీచేస్తారనే ఉత్కంఠ నెలకొన్నది. ప్రియాంక పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా.. చివరకు రాహుల్‌ గాంధీ అక్కడ బరిలో నిలిచారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు సీట్లలోనూ రాహుల్‌ విజయం సాధించిన నేపథ్యంలో ఏదో ఒకటి వదులకోవాల్సి వచ్చింది. అయితే.. తాను దేన్ని వదులుకోవాలో తేల్చుకోలేక పోతున్నానని రాహుల్‌ ఇటీవల వాయనాడ్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో చెప్పారు. ఉత్తరాదిలో బలమైన స్థానం అయిన రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ ప్రాతినిథ్యం వహిస్తేనే మంచిదనే అభిప్రాయాలు కాంగ్రెస్‌ పెద్దల్లో వ్యక్తమయ్యాయి. వాయనాడ్‌లో ప్రియాంక పోటీ చేస్తే విజయం సాధించడం ఖాయమని భావించి, ఇక్కడ ఆమెను బరిలో దింపుతున్నట్టు తెలుస్తున్నది.

రాయ్‌బరేలీ, వాయనాడ్‌ ఈ రెండు నియోజకవర్గాలతో తనకు ఎంతో అనుబంధం ఉన్నదని రాహుల్‌ గాంధీ చెప్పారు. వాయనాడ్‌ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీచేస్తారని తెలిపారు. అంతకు ముందు ఉదయం మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. రెండు నియోజకవర్గాల ప్రజలకు సంతోషం కలిగిస్తానని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి రెండు సీట్లలో విజయం సాధించినట్టయితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 14 రోజుల వ్యవధిలో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజీనామా విధివిధానాలపై లోక్‌సభ అధికారులను రాహుల్‌ గాంధీ ఇప్పటికే సంప్రదించినట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత బాధ్యతను రాహుల్‌ తీసుకునే అంశంపైనా సమావేశంలో చర్చించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

Latest News