Rains | ఈసారి సాధారణం కంటే అధికంగా వర్షాలు.. నాలుగు రోజుల్లో కేరళకు రుతుపవనాలు

Rains | ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు (Rains) కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ జూన్‌-సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలో వర్షాలు సాధారణ స్థాయికి మించి ఉంటాయని అంచనా వేసింది. అదేవిధంగా రాబోయే నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ వెల్లడించింది.

  • Publish Date - May 28, 2024 / 09:22 AM IST

Rains : ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు (Rains) కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ జూన్‌-సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలో వర్షాలు సాధారణ స్థాయికి మించి ఉంటాయని అంచనా వేసింది. అదేవిధంగా రాబోయే నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ వెల్లడించింది.

దేశంలో ఈ వానాకాలంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు పడే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొన్నది. ఈశాన్య భారత్‌లో సాధారణం కంటే తక్కువగా, వాయవ్య భారత్‌లో సాధారణంగా, మిగతా ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా పడతాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. అయితే ఒకవైపు రుతుపవనాలు సమీపిస్తున్నా దేశంలో ఎండలు మాత్రం దంచికొడుతూనే ఉన్నాయి.

పశ్చిమ, వాయవ్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశాలున్నాయి. సోమవారం అత్యధికంగా జగిత్యాల జిల్లా జైనలో 46.5 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో ఎండ తక్కువగా ఉన్నా ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడ్డారు.

Latest News