Site icon vidhaatha

కోర్టులో రాజస్థాన్‌ సీఎం క్షమాపణలు

విధాత: న్యాయ వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందంటూ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆ రాష్ట్ర హైకోర్టులో వ్రాతపూర్వక క్షమాపణలు చెప్పారు. గత ఆగస్టు 30వ తేదీన గెహ్లాట్‌ విలేఖరులతో మాట్లాడిన సందర్భంలో నేడు న్యాయ వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందని, కొందరు న్యాయవాదులు స్వయంగా రాతపూర్వకంగా తీర్పును తీసుకుని, అదే తీర్పును వెలువరించారని విన్నానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.



గెహ్లాట్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ న్యాయవాదులు జోద్‌పూర్‌లో ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. సీఎం గెహ్లాట్‌పై కేసులు కూడా పెట్టారు. కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్ సైతం వేశారు. సెప్టెంబర్‌ 5న కోర్టులో పిటిషన్‌ను విచారణకు లిస్టు చేసిన నేపధ్యంలో గేహ్లాట్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. న్యాయవ్యవస్థలో అవినీతిపై చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతం కాదన్నారు. తనకు న్యాయవ్యవస్థపై సర్వదా గౌరవం, నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

Exit mobile version