దేశంలో ఆరు నెలల్లోనే ఏకంగా 554 మంది భర్తలు హత్యలతో..ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయినట్లుగా వెల్లడైన నివేదిక సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా భర్తల మరణాలకు సంబంధించిన ఆందోళనకర గణాంకాలను తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ విడుదల చేసింది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి జులై 14 వరకు దేశంలో మొత్తం 554 మంది భర్తలు హత్యలు లేదా ఆత్మహత్యల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ నివేదికలో వెల్లడైన వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
హత్యలకు ప్రధాన కారణం అదే..
దేశంలో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుండగా, ఒకరి కంటే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఆరునెలల్లో మృతిచెందిన భర్తల మొత్తం మరణాల్లో 322 మంది భర్తలు తమ భార్యలు లేదా వారి ప్రియుల చేతిలో హత్యకు గురైనట్లు పేర్కొంది. మరోవైపు భర్తల హత్యలకు ప్రధాన కారణం వివాహేతర సంబంధాలేనని ఈ నివేదిక గుర్తించింది. నమోదు చేసిన 322 హత్య కేసుల్లో 194 (సుమారు 60.2 శాతం) ఘటనలకు ఇదే కారణమని తేలింది. వివాహేతర సంబంధాన్ని భర్తలు వ్యతిరేకించినప్పుడు లేదా అడ్డుకున్నందుకు భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నిన ఆరోపణలు అనేక కేసుల్లో ఉన్నాయని ఆ ఫౌండేషన్ తెలిపింది.
దీర్ఘకాలిక విబేధాలు..వేధింపులతోనే ఆత్మహత్యలు
మరో 232 మంది వైవాహిక విభేదాలు, గృహహింస, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు వంటి కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించింది. వీటిలో 104 కేసులు (44.83 శాతం) దీర్ఘకాలిక గృహ వివాదాలే ప్రధాన కారణమని గుర్తించింది. మరో 57 కేసులు (24.57 శాతం) భార్యలు లేదా అత్తమామల వేధింపుల ఆరోపణలు కారణమని ఆరోపించింది. 29 కేసులు (12.5 శాతం) వివాహేతర సంబంధాలతో ముడిపడి ఉన్నట్లు పేర్కొంది. ఇక భర్తల ఆత్మహత్య కేసులలో అనేక మంది బాధితులు వివరణాత్మక సూసైడ్ నోట్లు లేదా వీడియోలు రికార్డ్ చేశారని ఈ నివేదిక పేర్కొంది. దీర్ఘకాలిక వేధింపులు, గృహ హింస, తప్పుడు క్రిమినల్ కేసులు, తమ పిల్లలను కలుసుకోనివ్వకపోవడం లేదా నిరంతర మానసిక క్రూరత్వం వంటి కారణాల వల్ల భర్తలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వివరించింది. కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న విభేదాలు, దాంపత్య జీవితంలో ఏర్పడుతున్న సమస్యలు కొంతమంది పురుషులను తీవ్ర నిర్ణయాలకు దారితీస్తున్నాయని ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’నివేదిక అభిప్రాయపడింది.
అత్యధిక హత్యలు ఏపీలోనే..
ఈ నివేదిక ప్రకారం గత ఆరు నెలల్లో ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 93 మంది భర్తల హత్యలు, 103 మంది భర్తల ఆత్మహత్యలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు కూడా అధిక సంఖ్యలో నమోదైన కేసుల జాబితాలో ఉన్నాయి. ఈ సంవత్సరం నమోదైన అత్యంత దారుణమైన 25 కేసులను ఫౌండేషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీటిలో భర్తల తల నరకడం, శరీరాన్ని ముక్కలుగా నరకడం, విషప్రయోగం, ఇంటి నేల కింద పాతిపెట్టడం, సజీవంగా దహనం చేయడం, లోతైన లోయల్లోకి తోసేయడం, భార్యలు లేదా వారి ప్రియుల కుట్రలతో హత్యలు చేయడం వంటి ఘటనలు ఉన్నాయని తెలిపింది.
ప్రతిరోజు భర్తల హత్యలు, ఆత్మహత్యల నమోదు..
అయితే ఈ గణాంకాలు ప్రభుత్వ అధికారిక నేర గణాంకాలు కావని, 2026 జనవరి నుంచి జులై 14 వరకు దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో ప్రచురితమైన వార్తలను సేకరించి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ స్పష్టం చేసింది. అందువల్ల ఈ సంఖ్యలను అధికారిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాలుగా పరిగణించరాదని కూడా తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్య కేసును ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు దీపికా నారాయణ్ భరద్వాజ్ ప్రధానంగా ప్రస్తావించారు. అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ కలసి లోయలోకి తోసి హత్య చేయడం వంటి దారుణాలు దేశంలో ప్రతిరోజూ నమోదవుతున్నాయని తెలిపారు. అయితే భర్తల హత్యలు, గృహ హింసకు గురైన పురుష బాధితుల కోసం అధికారిక నేర గణాంకాలలో ప్రత్యేక వర్గీకరణ లేకపోవడం వల్ల ఈ సమస్య వాస్తవ తీవ్రతను అంచనా వేయడం కష్టమవుతోందని ఆమె అన్నారు.
పరిష్కార చర్యలు రావాలి..
వైవాహిక జీవితంలో పెరుగుతున్న వివాదాలు, మానసిక ఒత్తిడి, గృహహింస వంటి అంశాలపై సమాజం, కుటుంబాలు, సంబంధిత సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలను తగ్గించేందుకు కౌన్సెలింగ్, చట్టపరమైన అవగాహన, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం ఎంతో అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హస్తినాపురంలో ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ నిర్వాహకుడు అతుల్ పవార్ (35) మృతి వెనుక అతని భార్య దామిని కుట్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితురాలు తన ప్రియుడు, స్కూల్ డ్రైవర్ తుషార్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడి తుషార్‌తో కలిసి విషసర్పంతో భర్తను కాటేయించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పామును సమకూర్చిన సోను, మరో నిందితుడు ఉమంగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, 2019లో ప్రేమ వివాహం చేసుకున్న అతుల్, దామిని దంపతులు కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. అయితే అతుల్ పేరుపై ఉన్న రూ. 20 లక్షల బీమా సొమ్మును కాజేయాలని, ప్రియుడితో కలిసి జీవించాలని దామిని పథకం పన్నింది. ఇందులో భాగంగా గురువారం రాత్రి అతుల్ తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపి, అతను గాఢనిద్రలో ఉన్నప్పుడు గదిలోకి విషపూరితమైన పామును వదిలారు. ఆ పాము కాటుకు అతుల్ మరణించాడు.
సందేహం రాకుండా ఉండేందుకు భర్త పాము కాటుకు గురయ్యాడని ఆమె నాటకం ఆడింది. అయితే ఘటనా స్థలంలోని పరిస్థితులపై అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను విశ్లేషించగా అసలు నిజం బయటపడింది. నిందితుల ఫోన్లలో పాము ఫొటోలు లభ్యమయ్యాయి. తాము పామును కొనుగోలు చేసినట్లు డ్రైవర్ తుషార్ అంగీకరించాడు. 20 రోజుల క్రితం కూడా కారుతో ఢీకొట్టి అతుల్‌ను చంపేందుకు ప్రయత్నించినట్లుగా కూడా విచారణలో వెల్లడైంది. ఈ సంచలన ఘటనపై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచేందుకు చర్యలు చేపట్టారు.
ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య! 🐍
🔸 ప్రియుడి కోసం భర్త అతుల్ పన్వార్‌ను హత్య చేసిన కేసులో భార్య దామిని అలియాస్ ముస్కాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
🔸 ప్రియుడి తుషార్‌తో కలిసి విషసర్పంతో భర్తను కాటేయించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పామును సమకూర్చిన సోను,… pic.twitter.com/LOlqAgukPF
— ముచ్చట్లు (@muchatlu_) July 18, 2026
