Site icon vidhaatha

Sam Pitroda | తూర్పు వాళ్లు చైనీయుల్లా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్‌లలా కనిపిస్తారు : శామ్‌ పిట్రోడా

Sam Pitroda : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కున్న ఆయన.. తన మాటలతో మరో కొత్త వివాదానికి తెరలేపారు. భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.

భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి శామ్‌ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన మాటలు మరోసారి దేశవ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించాయి. ప్రజాస్వామ్యానికి మన దేశం ఓ నిదర్శనమని, లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిషర్లతో పోరాడారని పిట్రోడా గుర్తుచేశారు. మనది వైవిధ్యమైన దేశం కాబట్టి తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమాన ఉన్న ప్రజలు అరబ్బుల్లా కనిపిస్తారని, అదేవిధంగా ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయుల మాదిరిగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్‌ల మాదిరిగా ఉంటారని అన్నారు.

ఎవరు ఎలా ఉన్నాసరే మనమంతా సోదర సోదరీమణులమేనని, మనమంతా పరస్పరం భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను గౌరవించుకుంటూనే ఉంటామని పిట్రోడా వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దేశ ప్రజల మూలాల్లో పాతుకుపోయాయని చెప్పారు. పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాను ఈశాన్య భారతదేశానికి చెందిన వ్యక్తినని, కానీ చైనీయుడిలా కనిపించనని, భారతీయుడిలానే కనిపిస్తానని అసోం సీఎం హిమాంత బిశ్వశర్మ అన్నారు. భారతదేశం గురించి కనీస జ్ఞానం తెలుసుకుని మాట్లాడాలని ఆయన ఎద్దేవా చేశారు. వైవిధ్య భారతావనిలో భిన్నంగా కనిపించినా సరే అందరూ ఒక్కటేనని అన్నారు. పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి, నటి కంగనా రనౌత్ కూడా ఘాటుగా స్పందించారు. విభజించు-పాలించడం కాంగ్రెస్‌ సిద్ధాంతమనేది పిట్రోడా వ్యాఖ్యలతో స్పష్టమవుతోందన్నారు.

Exit mobile version