విమానాలకు వరుస బెదిరింపులు.. తాజాగా ఆకాశ ఎయిర్‌ఫ్లైట్‌కు

193 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై వెళుతున్న ఆకాశ ఎయిర్‌ఫ్లైట్‌ను బాంబు బెదిరింపు నేపథ్యంలో అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు

  • Publish Date - June 3, 2024 / 06:08 PM IST

అహ్మదాబాద్‌: 193 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై వెళుతున్న ఆకాశ ఎయిర్‌ఫ్లైట్‌ను బాంబు బెదిరింపు నేపథ్యంలో అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. వెంటనే ప్రయాణికులందరినీ విమానం నుంచి దించి, భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని ఎయిర్‌లైన్‌ వర్గాలు తెలిపాయి. ఆకాశ ఎయిర్‌ఫ్లైట్‌ క్యూపీ 1719 విమానం ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరింది. ఇందులో ఒక చంటిపాప సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం గగనతలంలో ఉండగా.. ఎయిర్‌లైన్‌ వర్గాలకు అందులో బాంబు పెట్టినట్టు ఫోన్‌ వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించి సోమవారం ఉదయం 10.13 గంటలకు సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్‌ చేశారని ఎయిర్‌లైన్‌ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు చెన్నై నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో తనిఖీల అనంతరం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది.

Latest News