Site icon vidhaatha

Tamil Nadu | తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి?

చెన్నై: మరో రాజకీయ వారసుడికి పట్టాభిషేకానికి రంగం సిద్ధమవుతున్నది. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల శాఖల మంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని తమిళనాడు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆగస్ట్‌ 22వ తేదీలోపే ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారని డీఎంకే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల అనంతరం స్టాలిన్‌ను ఆయన తండ్రి, ముఖ్యమంత్రి కరుణానిధి ఉపముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం ఇప్పుడు అదే పద్ధతిలో తన కుమారుడిని స్టాలిన్‌ ఉపముఖ్యమంత్రిని చేయబోతున్నారు. ప్రభుత్వంలో మరిన్ని బాధ్యతలు నిర్వహించడం ద్వారా తన తండ్రిపై భారాన్ని తగ్గించేందుకు ఉదయనిధికి పదోన్నతి కల్పిస్తున్నారని సమాచారం. ఆగస్ట్‌ 22న ముఖ్యమంత్రి ఎంకే స్థాలిన్‌ అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఆలోపే ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి అవుతారని డీఎంకేలోని సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. ముఖ్యమంత్రిపై భారం తగ్గించడం, పరిపాలన సాఫీగా సాగిపోవడం ఇందుకు ప్రధాన ఉదేశమని చెబుతున్నారు. ఉదయనిధి స్టాలిన్‌ ఉప ముఖ్యమంత్రి అయితే కీలక బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా రాజకీయంగా ఎదిగేందుకు కూడా ఉపకరిస్తందని సీనియర్‌ మంత్రి ఒకరు చెప్పారు. పైగా 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ చర్య ఉపకరిస్తుందని అన్నారు.

ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంపై తమిళనాడు రాజకీయవర్గాల్లో మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. ఉదయనిధి స్వయంగా ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టారని కొందరు అంటున్నారు. అయితే.. అటువంటి వాదనలను ఒక సీనియర్‌ మంత్రి కొట్టిపారేశారు. యువకుడు కావడం వల్లే ఇటువంటి ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే 2026 ఎన్నికల్లో ఉదయనిధి మరింత కీలకంగా పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
తమిళనాడు మంత్రివర్గాన్ని కూడా విస్తరించాల్సి ఉన్నది. ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత విస్తరణ చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. విస్తరణపై ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదని, ముందుగా పలువురు మంత్రుల పనితీరును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని డీఎంకే సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

2024 జనవరిలోనే ఉదయనిధికి పదోన్నతి విషయంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే.. వాటిని స్టాలిన్‌ తోసిపుచ్చారు. ఇవి తన ప్రత్యర్థులు సృష్టించిన వదంతులేనని కొట్టిపారేశారు. తాను సహా మంత్రులందరూ ముఖ్యమంత్రికి ఉపముఖ్యమంత్రులుగానే పనిచేస్తున్నామని ఉదయనిధి స్టాలిన్‌ కూడా స్వయంగా వివరణ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
ఈ నిర్ణయం పట్ల పార్టీలోని సీనియర్‌ నేతలు ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు ఇద్దరు సీనియర్‌ డీఎంకే నాయకులు స్పందించారు. శక్తిమంతులైన మంత్రులను కదపనంత కాలం ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని వారు స్పష్టం చేశారు.
46 ఏళ్ల ఉదయనిధి స్టాలిన్‌.. రెడ్‌ జైంట్స్‌ పేరిట సినీ నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. తమిళ, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని సినీపరిశ్రమల్లో ఈ సంస్థ ప్రముఖంగా ఎదిగింది.
కొంతకాలంగా ఉదయనిధి పదోన్నతిపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. స్టాలిన్‌ నాస్తికుడైనప్పటికీ.. ఆయన భార్య దుర్గ, బావమరిది సబరీశన్‌ ఆస్తికులు. స్టాలిన్‌ ముఖ్యమంత్రి పదవి కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. డీఎంకేలో నాయకుడిగా ఎదిగి మంత్రి పదవి చేపట్టే సమయానికే ఆయనకు 50 ఏళ్లు దాటిపోయాయి. ఉదయనిధి విషయంలో అంత వ్యవధి లేకుండా చూడాలనే అభిప్రాయం స్టాలిన్‌లో ఉన్నదని చెబుతున్నారు.

Exit mobile version