న్యూఢిల్లీ : తమిళనాడులోని అధికారిక డీఎంకే పార్టీ ప్రజలను విడదీసేలా రాజకీయాలు చేస్తోందని టీవీకే(TVK) చీఫ్, సినీ నటుడు విజయ్(Vijay) తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఓ కులానికి చెందిన పార్టీగా ముద్ర వేయాలని చూశారని…పార్టీ లాగేసుకోవాలని చూశారని..అయితే ప్రజలు మాత్రం ఆ ప్రచారాన్ని నమ్మలేదని గుర్తు చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యం అని జోస్యం చెప్పారు. రెండు నెలల క్రితం కరూర్‌లో తొక్కిసలాట తర్వాత నిలిచిపోయిన ఆయన రాజకీయ ప్రచారం తిరిగి ప్రారంభించారు.కాంచీపురం జిల్లాలో ఓ ఇండోర్ సదస్సులో ప్రసగించారు. డీఎంకే పార్టీ విధానం దోపిడీ భావజాలమని విజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ వారసత్వ రాజకీయాలకు, రాడికల్స్‌కు నిలయమని మండిపడ్డారు. విజయ్ తో ఎందుకు పెట్టున్నామా అని తలచుకుని తలచుకుని బాధపడే రోపజ త్వరలోనే వస్తుందని విజయ్ వ్యాఖ్యానించారు. డీఎంకే తమకు రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని విజయ్ స్పష్టం చేశారు.
సమానత్వం కోసం 12 పాలసీలు
తమిళనాడు ప్రజల సమానత్వం, సంక్షేమం కోసం టీవీకే 12పాలసీలను ప్రకటిస్తున్నట్లుగా విజయ్ వెల్లడించారు. రాష్ట్రంలో వరదలు ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని, ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యం అన్నారు. అందుకే తాను ప్రజల్లోకి వచ్చానని.. మీ కోసం పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు విజయ్ సభకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. సదస్సు కోసం ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణాన్ని ఎంచుకొన్నారు. 2వేల మందికి క్యూఆర్‌కోడ్ పాస్‌లు ఇచ్చి.. వారిని మాత్రమే అనుమతించారు. సభకు వచ్చే వారి కోసం ఆహారం, నీరు, ఇతర ఏర్పాట్లు చేశారు. అనుమతులు లేని వారు చొరబడకుండా ప్రాంగణం చుట్టూ షీట్లను అమర్చారు.
