సందీప్ ఘోష్(Dr. Sandip Ghosh)… గత కొన్ని రోజులుగా దేశం మొత్తం మార్మోగిపోతున్న పేరు. కోల్‌కతాలోని ఆర్జీ కరా వైద్య కళాశాల–ఆసుపత్రి (RG Kar Medical College and Hospital) మాజీ ప్రిన్సిపాల్. ఈనెల 9న ఒక వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగినప్పుడు తనే ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. జరిగిన దారుణ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినవాడు. ఆనాటి నుండి వరుసగా జరిగిన ఎన్నో ఘటనలకు మూలకారకుడు. టిఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి అత్యంత సన్నిహితుడిగా పేరు. ఆ సాన్నిహిత్యమే అతన్ని కర్కోటకుడిగా మార్చేసింది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం, కోల్‌కతా హైకోర్టు ఈ ఘటనలో ప్రభుత్వ చర్యలపై సందేహాలు లేవనెత్తినపుడు అన్ని వేళ్లూ సందీప్‌నే చూపించాయి. కారణం, ఆ అమ్మాయి హత్యాచారం జరిగిన రోజు ఆ కాలేజీ అధిపతిగా ఉన్నది సందీపే కాబట్టి. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా(Autopsy without FIR) విద్యార్థిని మృతదేహానికి పోస్టమార్టం నిర్వహించారు. ఇది ఈ దేశంలో ఇప్పటిదాకా జరగని విషయం. కోల్‌కతా పోలీసులు ఈ విషయమై సందీప్‌ను కనీసం ప్రశ్నించనూలేదు. ఘటన జరిగిన మూడురోజుల వరకు జరిగిన ఆందోళనల వల్ల పదవి నుండి వైదొలగినా, కేవలం మూడే మూడు గంటల్లో తిరిగి వేరే కాలేజీకి ప్రిన్సిపాల్‌గా నియమించబడ్డాడు. కేసు ఇప్పుడు సిబిఐ(CBI) చేతికి వెళ్లింది కాబట్టి, ఆరు రోజుల పాటు సందీప్‌ను సిబిఐ కూలంకషంగా ప్రశ్నించింది. ఆయన అధికారిగా ఉన్నప్పుడు కాలేజీలో జరిగిన ఆర్థికపరమైన అక్రమాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా మృతురాలి గుర్తింపును తెలపడం లాంటి అవకతవకలపై సిబిఐ విచారణ జరుపుతోంది.
ఒక తెలివైన విద్యార్థి నుండి, ప్రముఖ పూర్వవిద్యార్థి( illustrious alumni)గా, అక్కన్నుండి ఓ వైద్యుడిగా, తర్వాత మెడికల్ కాలేజీకి వివాదాస్పద ప్రిన్సిపాల్‌గా సందీప్ ఘోష్ ప్రస్థానం బహుముఖంగా సాగింది. చిన్నప్పటి సందీప్‌ను ఎరిగిన ఎవరూ అతను ఇలా మారాడంటే నమ్మడంలేదు.
ఈ సంఘటన జరగడానికి ముందు, ఆ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ(Akthar Ali), ప్రభుత్వానికి, రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి, అవినీతి నిరోధక శాఖకు ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి గురించి పదిహేను పాయింట్లతో ఫిర్యాదు చేయగా, ఎటువంటి చర్యా తీసుకోకపోగా, అలీనే బదిలీ చేసారు.
సందీప్ ఘోష్ చేసిన దారుణాలు అన్నిఇన్నీ కావని మెల్లమెల్లగా తెలుస్తున్నాయి. ఇప్పుడు తన పాపం పండటంతో బాధితులు, తన గురించి పూర్తిగా తెలిసిన వారు సిబిఐకి వివరాలందిస్తున్నారు. అనాథ శవాలను అమ్ముకోవడం, వాడిపారేసిన మెడికల్ వేస్ట్(Recycling Medical waste)ను తిరిగి బంగ్లాదేశ్‌లో రీసైక్లింగ్ చేయించి, తిరిగి కొత్తవాటిగా కొనడం, టెండర్లలో ఆశ్రిత పక్షపాతం, విద్యార్థులను కావాలనే ఫెయిల్ చేయడం లాంటివి ఎన్నో తన ఖాతాలో ఉన్నట్లు తెలిసింది.
కోల్‌కతాకు 80 కి.మీల దూరంలో, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బొంగావ్(Bongaon)లో చదువుకున్న సందీప్, మంచి తెలివైన విద్యార్థి(meritorious student)గా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు 85శాతానికి తక్కువ కాకుండా మార్కులు వచ్చేవి. 12వ తరగతిలో కూడా 80శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్నసందీప్ మెడికల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి, అడ్మిషన్ కూడా సంపాదించుకున్నాడు. ఇప్పటికీ ఆ పాఠశాలలో ప్రముఖ పూర్వ విద్యార్థిగా సందీప్ ఘోష్ పేరు బోర్డు మీద ఉంది. ఇప్పుడు ఆ పేరు కొట్టేయాలని అక్కడి టీచర్లు, స్టూడెంట్లు గొడవ చేస్తున్నారు.
మాకు తెలిసిన సందీప్ ఇలాంటివాడు కాదు. కొద్దమందే స్నేహితులతో చాలా నెమ్మదస్తుడి(soft nature)గా ఉండేవాడు. ఇలా మారాడంటే నమ్మలేకపోతున్నానని అప్పటి తన పక్కింటి పార్థసారథి తెలిపాడు. బహుశా దురాశే అతన్నీస్థాయికి తెచ్చింది. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అని ఆయన అన్నారు. 1994లో మెడికల్ డిగ్రీ చేతికి వచ్చినప్పటికీ, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్‌గా, సర్జన్‌గా చాల ఏళ్లవరకు అతనెవరికీ పెద్దగా తెలియదు. 2018లో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్ వచ్చాక, ఒక్కసారిగా అతను వెలుగులోకి వచ్చాడు. 2021లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్‌గా చార్జ్ తీసుకున్నాక తన విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టాడు. నాలుగు సంవత్సరాల పదవీకాలంలో అతను మూడు సార్లు బదిలీ(Transferred thrice) అయ్యాడు. అయితే ప్రతీసారి అయన తిరిగి అదే పోస్టులో నియమితుడయ్యేవాడు. ఒకసారైతే కొన్నిగంటల్లోనే. ఆర్జీ కార్ పూర్వ విద్యార్థులు ఆరోపించినదాని ప్రకారం, సందీప్ కాలేజీ, హస్పటల్ను తన సామ్రాజ్యం(fiefdom)గా భావించేవాడు. దానికి అతని అనుచరులు పూర్తిస్థాయిలో సహకరించేవారు. తనకు విధేయులుగా ఉన్న విద్యార్థులకు పూర్తిస్వేచ్ఛనిచ్చి, ఇతర విద్యార్థులను రకరకాలుగా హింసించేవాడని, తన గ్రూప్ మొత్తం కాలేజీని, హాస్పటల్‌ను నియంత్రించేదని, హస్టల్ సీట్లనుండి, ఆసుపత్రి బెడ్ల దాకా, అంతటా వసూళ్లేనని వారు ఆరోపించారు.
కోల్‌కతాలో సందీప్ ఘోష్ పక్కింటివారు చెప్పిందేంటంటే, తను తన భార్య పచ్చి బాలింతరాలుగా ఉన్నప్పుడు కడుపులో తంతే, ఆమె ప్రాణాపాయస్థితికి వెళ్లందనీ, అప్పుడు కూడా ఇరుగుపొరుగు వారే కాపాడారని తెలిపారు. ఘోష్ చేసిన ఇలాంటి అరాచకాలకు అంతేలేదని అతనేంటో తెలిసిన అందరూ ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరకంగా ప్రధాన ముద్దాయి(Sanjay Roy) కంటే సందీప్ ఘోష్ ఇంకా ప్రమాదకారి అని వారి అభిప్రాయం.