క్రెడిట్ కార్డులు జారీ చేసే సమయంలో కొంత పరిమితి ఉంటుంది. మన ఆదాయం, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటారు. క్రెడిట్ కార్డులు తీసుకొనే సమయంలో తక్కువ లిమిట్ ఉన్న కార్డు తీసుకొంటే దాని పరిమితిని పెంచుకోవాలంటే ఇబ్బందులు ఉంటాయి. అయితే ఆర్ధికంగా క్రమశిక్షణగా ఉంటే క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవచ్చా?
క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచుకొనే అవకాశం ఉంది. మీరు ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకున్న సమయంలో మీ ఆదాయం ఆధారంగా క్రెడిట్ కార్డు జారీ చేస్తారు. అయితే ఈ కార్డుదారుడు సక్రమంగా బిల్లులు చెల్లిస్తే క్రెడిట్ కార్డు లిమిట్ సులభంగా పెంచురకొనేందుకు వీలుంది. ఉదహరణకు మీరు రూ. 40వేల లిమిట్ తో క్రెడిట్ కార్డు మంజూరైతే దాన్ని రూ. 1 లక్షకు మించి కూడా లిమిట్ ను పెంచుకోవచ్చు. అయితే ఈ కార్డు ద్వారా చేసిన ఖర్చులు తిరిగి బిల్లులు చెల్లింపు హిస్టరీ ప్రధానంగా కార్డు లిమిట్ పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచాలని కోరుతూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా అప్లయ్ చేసుకోవచ్చు. లేదా మీకు క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకు శాఖలో సంప్రదించి క్రెడిట్ లిమిట్ ను పెంచాలని కోరవచ్చు. మీరు క్రెడిట్ కార్టు బిల్లుల చెల్లింపు సక్రమంగా ఉంటే క్రెడిట్ లిమిట్ ఆటోమెటిక్ గా పెరుగుతూనే ఉంటుంది. కొన్ని సమయాల్లో క్రెడిట్ కార్డు లిమిట్స్ పెంచుతామని టెలీకాలర్స్ నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఇలాంటి ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
క్రెడిట్ కార్డు లిమిట్ ను ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు లిమిట్ అంటే ఆ కార్డు ద్వారా ఖర్చు చేసే మొత్తం. అంటే ఒక్క క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 1 లక్ష ఉంటే ఆ కార్డుపై రూ. 1 లక్ష వరకు ఖర్చు చేయవచ్చు. ప్రతి క్రెడిట్ కార్డు లిమిట్ పై 30 శాతం వరకు మాత్రమే ఖర్చు చేయాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డుపై 30 శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తే దాని ప్రభావం ఆ క్రెడిట్ కార్డుదారుడి క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు మీరు క్రెడిట్ కార్డు ద్వారా చేసిన ఖర్చులకు సంబంధించిన సక్రమంగా వాయిదాలు చెల్లించారా? ఎన్ని వాయిదాలు ఆలస్యంగా కట్టారు? ఎన్ని వాయిదాలపై జరిమానా కట్టారు? క్రెడిట్ కార్డు బిల్లులు సెటిల్ చేసుకొన్నారా? ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. ప్రధానంగా మీ క్రెడిట్ స్కోరు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల ఆధారంగా క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచుతారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచాలంటే గత 24 నుంచి 36 నెలల కాలంలో మీ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల గురించి బ్యాంకులు ఆరా తీస్తాయి. మీ క్రెడిట్ స్కోరు 720 నుంచి 750 ఉంటే క్రెడిట్ కార్డు లిమిట్ సులభంగా పెంచే ఛాన్స్ ఉంది. చిన్న చిన్న లిమిట్ పెంపుదల విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువ పరిమితి పెంపు విషయంలో జాగ్రత్తలు తప్పవు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలని భావించిన సమయంలో మీ ఆదాయం పెరిగిందా? ఇతరత్రా మార్గాల ద్వారా అదనపు ఆదాయం వస్తోందా? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకొని ఆ మేరకు ఖర్చు చేస్తే ఆ బిల్లుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా… ఆలస్యంగా ఈ బిల్లులను చెల్లించినా క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. మీ జీతం పెరిగిన సమయంలో మీ జీతం పెరిగిందని మీకు క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకుకు సమాచారం ఇచ్చి ఈ మేరకు క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచాలని కోరవచ్చు. లేదా కొత్త కార్డును జారీ చేయాలని కోరవచ్చు. క్రెడిట్ స్కోర్ల ఆధారంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు. క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా చూసుకోవడం ద్వారా క్రెడిట్ కార్డుల లిమిట్ పెంచుకోవచ్చు.