Site icon vidhaatha

Govt Employees | ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలే.. కేంద్ర ప్రభుత్వం వార్నింగ్‌..

Govt Employees : పలువురు ఉద్యోగులు కార్యాలయాలకు తరచూ ఆలస్యంగా వస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. మరికొందరు ఉద్యోగులు నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతుండటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉద్యోగుల పనివేళల విషయాన్ని ఇకపై తాము తీవ్రంగా పరిగణిస్తామని, ఆలస్యంగా వచ్చేవారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చింది.

ఆలస్యంగా కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులపై సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఆధార్‌తో అనుసంధానమైన బయోమెట్రిక్‌ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని, అదేవిధంగా పలువురు తరచూ కార్యాలయాలకు ఆలస్యమవుతున్నారని గుర్తించినట్లు కేంద్రం తెలిపింది.

మొబైల్‌ ఫోన్‌ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థను వాడి ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగేలా చేయవచ్చని ఉన్నతాధికారులకు సూచించింది. అన్ని విభాగాలు, శాఖలు, సంస్థలు తరచూ తమ ఉద్యోగుల హాజరు నివేదికలను పర్యవేక్షించాలని సూచించింది. ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు ఎన్ని రోజులు ఆలస్యమైతే అన్ని రోజులు ఒకపూట చొప్పున సెలవుగా పరిగణించాలని పేర్కొంది.

ఒకవేళ ఉద్యోగి సెలవులు మిగిలిలేకపోతే వేతనంలో నుంచి కోతపెట్టాలని కేంద్ర సర్కారు సూచించింది. తగిన కారణాలు చూపితే మాత్రం నెలలో గరిష్ఠంగా రెండు రోజులు గంటకు మించకుండా ఆలస్యాన్ని అనుమతించవచ్చని పేర్కొంది. ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లిపోవడాన్ని కూడా ఆలస్యంగా రావడానికి సమానంగానే పరిగిణించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో సూచించింది.

Exit mobile version