Kargil Soldiers | దేశ రక్షణలో భాగంగా వీరమరణం పొందిన సైనికుల( Kargil soldiers )పై ఓ వ్యక్తి వినూత్నంగా తన దేశభక్తి( Patriotism )ని చాటాడు. కార్గిల్ యుద్ధం( Kargil War )లో అమరులైన సైనికుల త్యాగానికి గుర్తుగా తన శరీరంపై 631 టాటూ( Tattoo )లను ఆ వ్యక్తి వేయించుకున్నాడు. ఈ టాటూల్లో గాంధీ( Gandhi ), భగత్ సింగ్, సుభాష్ చంద్రబోష్, ఝాన్సీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ప్రముఖుల చిత్రాలను కూడా టాటూ రూపంలో వేయించుకున్నాడు. ఇందుకు గానూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడంతో పాటు లివింగ్ వాల్ మెమోరియల్( Living Wall Memorial ) బిరుదును సొంతం చేసుకున్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరంటే..?
ఉత్తర్ ప్రదేశ్‌లోని హపూర్ జిల్లాకు చెందిన అభిషేక్ గౌతమ్( Abhishek Gautam ).. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల త్యాగానికి గుర్తుగా ఈ టాటూలు వేయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఒకసారి తన స్నేహితులతో సరిహద్దుల్లోకి వెళ్లినప్పుడు.. అత్యంత ప్రమాదకర ఘటన జరిగింది. అప్పుడు భారత సైనికులు తన స్నేహితుడిని కాపాడారు. సైనికుల వల్లే తాము సురక్షితంగా బయటపడ్డామని, ఇప్పటికీ సురక్షితంగా ఉంటున్నామని అభిషేక్ తెలిపాడు.
దేశ రక్షణలో భాగంగా అమరులైన సైనికులకు ప్రత్యేకంగా నివాళులర్పించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే టాటూ ఆలోచన వచ్చింది. వినూత్నంగా సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికుల పేర్లను తన శరీరంపై టాటూ రూపంలో వేయించుకోవాలని అనుకున్నాను. ఇందులో భాగంగా ముందుగా కార్గిల్ అమరవీరుల పేర్లను టాటూ రూపంలో వేయించుకున్నట్లు గౌతమ్ పేర్కొన్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు 559 మంది సైనికుల పేర్లతో పాటు కార్గిల్ స్థూపం, ఇండియా గేట్ వంటి చిత్రాలను కూడా తన శరీరంపై పచ్చబొట్టు వేయించుకున్నాడు గౌతమ్.
కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలను కూడా అభిషేక్ గౌతమ్ సందర్శించాడు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అమరుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నాడు. అమరుల ఇంటి నుంచి మట్టిని తీసుకెళ్లి.. కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద ఉంచుతున్నాడు. 2019లో అమరుల స్తూపం వద్ద ఓ కలశాన్ని ఉంచిన అభిషేక్ గౌతమ్.. అందులోనే ఈ మట్టిని పెడుతున్నాడు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందని అభిషేక్ గౌతమ్ చెబుతున్నాడు. నిరంతరం అమరులను తలుచుకుంటానని, వారి కుటుంబ సభ్యులను కలుస్తానని అంటున్నాడు అభిషేక్ గౌతమ్.