Wayanad Tragedy : కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 300 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండచరియలను తొలగించినా కొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు వెలికి తీసిన మృతదేహాల సంఖ్య 308కి చేరిందని అధికారులు నిర్దారించారు.
డ్రోన్ ఆధారిత రాడార్ సాయంతో నాలుగో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విలయంలో 200 మందికిపైగా గాయపడ్డారు. వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారీ వర్షాలు పడుతుండటం, ఘటన జరిగిన ప్రాంతానికి సజావుగా వెళ్లే పరిస్థితులు లేకపోవడం, భారీ పరికరాల కొరత లాంటివి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి.
పేరుకుపోయిన బురదను, నేల కూలిన వృక్షాలను, భవనాల శిథిలాలను తొలగించడం కష్టంగా మారింది. అంతేగాక ఈ ఘటనలో గల్లంతైన వారిలో ఇంకా 45 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.