న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికలు రేపటితో ముగియనున్నాయి. ఏప్రిల్ 19వ తేదీన తొలి దశ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు ఆరు దశల ఎన్నికలు ముగిశాయి. జూన్ 1వ తేదీన చివరి దశ(ఏడో దశ) ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఏడో దశ ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. జూన్ 1 జరిగే ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో 542 లోక్ సభ సీట్ల ఫలితాలను జూన్ 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది .
అయితే ఈ ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనేది కీలకంగా మారింది. అంతేకాకుండా గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అవుతుందా..? లేదా..? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే పార్టీలు హోరాహోరీగా భావిస్తున్న ఈ ఎన్నికలను..ప్రజలు మాత్రం సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. గత ఆరు విడతల్లో నమోదైన పోలింగ్గే అందుకు నిదర్శనం. తొలి దశలో 66.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత రెండో విడతలో 66.71 శాతం, మూడో దశలో 65.68 శాతం, నాలుగో దశలో 69.16 శాతం, ఐదో దశలో 62.2 శాతం, ఆరో విడత పోలింగ్‌లో 61.98 శాతం పోలింగ్ నమోదైంది. చివరి దశలో ఎంత శాతం పోలింగ్ నమోదు అవుతుందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
గత పది లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే..
2019లో 67.4 శాతం, 2014లో 66.4 శాతం, 2009లో 58.19 శాతం, 2004లో 58.07 శాతం, 1999లో 59.99 శాతం, 1998లో 61.97 శాతం, 1996లో 56.94 శాతం, 1991లో 56.73 శాతం, 1989లో 61.95 శాతం, 1984లో 63.56 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కానుందా..? లేదా..? అనే విషయం రేపు తేలనుంది.