Site icon vidhaatha

Kodikunnil Suresh | ఎవ‌రీ కే సురేశ్‌..? లోక్‌స‌భ‌ స్పీక‌ర్ ఎన్నిక‌లో గెలిచేనా..?

Kodikunnil Suresh | న్యూఢిల్లీ : లోక్‌స‌భ స్పీక‌ర్ ప‌ద‌వికి 1946 త‌ర్వాత తొలిసారి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అధికారం చేజిక్కించుకున్న ఎన్డీఏ కూట‌మి స్పీక‌ర్ ప‌ద‌వికి ఓం బిర్లాను బ‌రిలోకి దింపింది. ఆయ‌న త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను లోక్‌స‌భ సెక్ర‌ట‌రీకి దాఖ‌లు చేశారు. ప్ర‌తిప‌క్షాల‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చేందుకు బీజేపీ తిరస్కరించడంతో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్‌ ఎంపీ కే సురేశ్‌ బరిలో నిలిచారు. దీంతో 1946 తర్వాత తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక జరిగే పరిస్థితి నెలకొన్నది. అధికార పక్షానికి సంఖ్యాబలం అధికంగా ఉన్న నేపథ్యంలో ఓం బిర్లా ఎన్నిక లాంఛనమే. అయినప్పటికీ.. ప్రతిపక్ష బలం కూడా స్పష్టంకానున్నది.

ఎవ‌రీ కే సురేశ్‌..?

ఇండియా కూట‌మి త‌ర‌పున స్పీక‌ర్ ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న కొడికున్నిల్ సురేశ్ వ‌రుస‌గా ఎనిమిది సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. లోక్‌స‌భ‌లో అత్యంత సీనియ‌ర్ మెంబ‌ర్ ఈయ‌నే. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని మావేలిక‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ మెంబ‌ర్(ప్ర‌త్యేక ఆహ్వానితుడు). ఇక 2021లో కేర‌ళ కాంగ్రెస్ చీఫ్ ప‌దవికి పోటీ ప‌డ్డారు. కేర‌ళ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప‌ని చేశారు. లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ చీఫ్‌విప్‌గా కూడా ప‌ని చేశారు. తొలిసారిగా 1989లో లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 1991, 1996, 1999 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆడూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. 1998, 2004 ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. సురేశ్ కుల ధృవీకరణ పత్రం నకిలీదని, అతను క్రైస్తవుడనే ఆరోపణలపై కేరళ హైకోర్టు 2009 లోక్‌సభ ఎన్నికలలో అతని గెలుపుపై ​​అనర్హత వేటు వేసింది. అనంతరం సుప్రీంకోర్టు కేర‌ళ హైకోర్టు తీర్పును రద్దు చేసింది. 2014, 2019, 2024 ఎన్నిక‌ల్లో మావేలిక‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు.

Exit mobile version