Abdul Rashid | తీహార్ జైల్లో శిక్ష అనుభ‌విస్తూ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచిన ఇంజినీర్..! ఎవ‌రీ అబ్దుల్ ర‌షీద్..?

Abdul Rashid | లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓ స్వ‌తంత్ర అభ్య‌ర్థి రికార్డు సృష్టించారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభ‌విస్తూ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచారు. ఆ వ్య‌క్తి గెలుపు కోసం త‌న ఇద్ద‌రు కుమారులు తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డారు. మ‌రి గెలిచింది సామాన్యుడి మీద కాదు.. మాజీ ముఖ్య‌మంత్రిపై. మ‌రి ఆ స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఎవరో తెలుసుకోవాలంటే జ‌మ్మూక‌శ్మీర్‌లోని బారాముల్లా వెళ్లాల్సిందే.

  • Publish Date - June 4, 2024 / 03:43 PM IST

Abdul Rashid |న్యూఢిల్లీ : లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓ స్వ‌తంత్ర అభ్య‌ర్థి రికార్డు సృష్టించారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభ‌విస్తూ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచారు. ఆ వ్య‌క్తి గెలుపు కోసం త‌న ఇద్ద‌రు కుమారులు తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డారు. మ‌రి గెలిచింది సామాన్యుడి మీద కాదు.. మాజీ ముఖ్య‌మంత్రిపై. మ‌రి ఆ స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఎవరో తెలుసుకోవాలంటే జ‌మ్మూక‌శ్మీర్‌లోని బారాముల్లా వెళ్లాల్సిందే.

బారాముల్లా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఇంజినీర్ అబ్దుల్ ర‌షీద్ బ‌రిలో దిగారు. ఇదే స్థానం నుంచి జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా కూడా పోటీ చేశారు. కానీ ఒమ‌ర అబ్దుల్లాను ఇంజినీర్ ర‌షీద్ చిత్తుగా ఓడించారు. ప్ర‌జా తీర్పును శిర‌సావ‌హిస్తాన‌ని ఒమ‌ర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అయితే ర‌షీద్ గెలిచినంత మాత్రాన ఆయ‌న‌ను జైలు నుంచి విడుద‌ల చేస్తార‌ని తాను అనుకోను అని ఒమ‌ర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

ఎవ‌రీ అబ్దుల్ ర‌షీద్..?

బారాముల్లా నియోజ‌క‌వ‌ర్గంలో అబ్దుల్ ర‌షీద్.. ఇంజినీర్ రషీద్‌గా అంద‌రికీ సుప‌రిచితం. టెర్ర‌ర్ ఫండింగ్ కేసులో అరెస్టు అయ్యారు ర‌షీద్. దీంతో ఆయ‌న‌ను తీహార్ జైలుకు త‌ర‌లించారు. టెర్ర‌ర్ ఫండింగ్ కార్య‌క‌లాపాల్లో ర‌షీద్ పాత్ర ఉంద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో జాతీయ‌ ద‌ర్యాప్తు సంస్థ‌(NIA) 2019లో ఆయ‌న‌ను అరెస్టు చేసింది. యూఏపీఏ చ‌ట్టం కింద ఒక రాజ‌కీయ నాయ‌కుడు అరెస్టు కావ‌డం ర‌షీదే తొలి వ్య‌క్తి.ఇక ఈ ఎన్నిక‌ల్లో తండ్రి గెలుపు కోసం ఆయ‌న ఇద్ద‌రు కుమారులు అబ్ర‌ర్ ర‌షీద్, అస్ర‌ర్ ర‌షీద్ విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ర‌షీద్ గెలుపు కోసం బారాముల్లా ప్ర‌జ‌లు క‌దిలివ‌చ్చారు. ర్యాలీల్లో తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చి ర‌షీద్‌కు భారీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక 2008, 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో లాంగేట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ర‌షీద్ గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అవామీ ఇత్తెహాద్ పార్టీ నుంచి ఆయ‌న పోటీ చేశారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ర‌షీద్ ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

Latest News