అఖిలపక్షంలో ప్రత్యేక హోదా అంశం
లేవనెత్తిన ఎన్డీయే భాగస్వామి జేడీయూ
ఇప్పటికే హోదాపై జేడీయూ తీర్మానం
సభలోనూ డిమాండ్ చేయనున్న జేడీయూ
హోదా కోరాలా? ప్యాకేజీ కోరాలా?
సందిగ్ధంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం
బీజేపీకి ఈ రెండు పార్టీల మద్దతే కీలకం
ప్రత్యేక హోదా కందీరీగల తుట్టెను మోదీ ప్రభుత్వం కదుపుతుందా?
ప్యాకేజీలతో ఆగ్రహాలను చల్లార్చుతుందా?
(విధాత ప్రత్యేకం)
మరోసారి ప్రత్యేక హోదా అంశం జాతీయ స్థాయిలో ప్రస్తావనకు వస్తున్నది. దీర్ఘకాలంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్న ఏపీ, బీహార్ రాష్ట్రాల పార్టీలతోపాటు.. తాజాగా ఒడిశా నుంచి కూడా ప్రత్యేక హోదా డిమాండ్ ముందుకు వచ్చింది. ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌ను జేడీయూ పునరుద్ఘాటించింది. అక్కడి ప్రతిపక్ష ఆర్జేడీ సైతం మద్దతు పలికింది. మరోవైపు పదేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్న ఏపీ నుంచి అనూహ్యంగా వైసీపీ ఆ డిమాండ్‌ను ముందుకు తీసుకు వచ్చింది కానీ.. ఎన్డీయే ప్రభుత్వంలో మరో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ మాత్రం ఈ విషయంలో మౌనం దాల్చడం విశేషం. వాస్తవానికి టీడీపీ తొలి ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది. ఏపీకి ప్రత్యేక రాష్ట్రం హోదా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీయే. కానీ.. మోదీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని నాన్చి.. చివరకు అసలు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. అయితే.. ఎన్నికలు దగ్గర పడే సమయానికి నాటి ప్రతిపక్ష వైసీపీ ప్రత్యేక హోదాను ప్రధాన అంశంగా తీసుకుని ప్రచారం చేసింది. ఈ సమయంలో ప్యాకేజీ ఆఫర్ వచ్చినా.. నాటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు పట్టుబట్టి.. ఎన్డీయే నుంచి వైదొలిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన వైసీపీని ప్రజలు గెలిపించారు. కానీ.. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్లిన మొదటిరోజే ప్రత్యేక హోదాపై జగన్ చేతులెత్తేశారు. అడుగుతాం కానీ పట్టుబట్టలేం అంటూ నిర్వేదం, నిస్సహాయత వ్యక్తం చేశారు. ఐదేళ్లలో పట్టుబట్టిందీ లేదు.. గట్టిగా వినతులు ఇచ్చిందీ లేదు. బీజేపీకి సొంతగానే పూర్తి మెజార్టీ ఉండటంతో ప్రతిపక్షాలు ఏమీ చేయలేక పోయాయి. దీంతో అప్పటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా కలగానే మిగిలిపోయింది.
అవకాశం కల్పిస్తున్న సంకీర్ణ ప్రభుత్వం
ఈ దఫా ఏపీలో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించారు. వాస్తవానికి ఏపీ ప్రజల పదేళ్ల కల నెరవేర్చుకునేందుకు ఈసారి అవకాశాలు ఉన్నాయి. అయితే.. అందుకు టీడీపీదే కీలక బాధ్యత. పదేళ్ల తర్వాత తొలిసారి మోదీ ప్రభుత్వం సొంతకాళ్లపై నిలబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని దుస్థినిని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కల్పించాయి. గత రెండు పర్యాయాలు సొంతగానే మెజార్టీ మార్కు దాటిన బీజేపీకి ఈసారి కన్ను లొట్టబోయింది. దీంతో ఎన్డీయే పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఏక పార్టీ ఏకఛత్రాధిపత్యంలో నడిచే ప్రభుత్వాల్లో కంటే.. సంకీర్ణ ప్రభుత్వాల్లోనే అందులోని భాగస్వామ్య పార్టీల రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే.. వాటి మద్దతు కీలకం కాబట్టి.. కేంద్రంలో ప్రధాన అధికార పార్టీ తన మిత్రులు అడిగినవి కాదనకుండా చేసిపెడుతుంది. సరిగ్గా ఇప్పుడు అలాంటి అవకాశమే అటు బీహార్‌లోని జేడీయూకు గానీ, ఏపీలోని టీడీపీకి గానీ వచ్చింది. బొటాబొటీ మెజార్టీతో అధికారంలో ఉన్న ఎన్డీయేలో ఏ చిన్న కుదుపు వచ్చినా.. ప్రభుత్వం పతనం కావడం తథ్యం. ఇటువంటి సమయంలో ఏపీ దశ, దిశ మార్చే ప్రత్యేక హోదాకు టీడీపీ పట్టుబడుతుందా? లేక కనీసం ఆ స్థాయిలో ప్యాకేజీనైనా సాధిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒక ఆంగ్ల వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన టీడీపీ నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక హోదా అంశం కూడా తమ ఆలోచనల్లో ఉన్నదని చెప్పారు. కానీ.. హోదా ఇచ్చేదే లేదని కేంద్రం భీష్మించుకుని ఉన్న సమయంలో ప్యాకేజీ కోరాలా? లేక హోదాపైనే పట్టుబట్టాలా? అన్న విషయంలో టీడీపీ సందిగ్ధంలో పడిపోయిందని చెబుతున్నారు.
మోదీ హోదా ఇస్తారా?
పదేళ్లు ఏకఛత్రాధిపత్యంతో పాలించిన నాటి మోదీ ప్రభుత్వానికి.. టీడీపీ, జేడీయూ అనే రెండు ఊతకర్రల సాయంతో నడుస్తున్న నేటి మోదీ ప్రభుత్వానికి ఏదైనా తేడా ఉన్నదా? అనేది ఇంకా తేలాల్సి ఉన్నది. ఇప్పటికైతే ఏమీ జరుగనట్టు, ప్రజలంతా తమను గెలిపించినట్టే బీజేపీ నేతల వ్యవహార శైలి ఉన్నది. తమకు సీట్లు తగ్గాయన్న అంశాన్ని మరుగునపెట్టి.. మేకపోతు గాంభీర్యాలను ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో ఒక కీలక అంశం కూడా ఉన్నది. తాను బలహీనపడ్డానని తనంతట తానుగా బయటపడితే.. భాగస్వామ్య పక్షాలు ఒక ఆట ఆడుకుంటాయనే విషయంలో బీజేపీ నేతలకు సందేహాలు లేవని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పటికీ బీజేపీ నేతలు దుందుడుకు స్వభావంతోనే ఉన్నారని అన్నారు. ఈ సమయంలో రెండు కీలక పక్షాల ప్రధాన డిమాండ్లయిన ప్రత్యేక హోదాను ప్రధాని ఇస్తారా? అనే సంశయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
బీహార్‌లో కూటమి నిలబడుతుందా?
మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో అక్టోబర్ లేదా నవంబర్‌లో జరుగనున్నాయి. అయితే.. 2025లో రాష్ట్రానికి బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారని, ఆ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత అశ్వినీ కుమార్ చౌబే చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనం రేపింది. బీహార్ అసెంబ్లీలో బీజేపీ ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా ఉన్నది. ఈ సమయంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు జేడీయూ నేతల్లో ఆగ్రహాన్ని రగిలించాయి. ఇది బీజేపీ ఒత్తిడి రాజకీయాలకు నిదర్శనమని జేడీయూ నేతలు మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు సంకీర్ణ రాజకీయాల్లో అనైతికమని వ్యాఖ్యానించారు. అయితే.. కీలక భాగస్వామ్య పార్టీకి కోపం రావడంతో బీజేపీ నేతలు వెంటనే నష్టనివారణ చర్యలకు దిగారు. ‘2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కుమార్ నాయకత్వంలో ఎన్డీయే పోటీ చేస్తుందని మోదీ ప్రకటించారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రభాకర్ మిశ్రా వివరణ ఇచ్చుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జేడీయూను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దనేది బీజేపీ నిర్ణయంగా కనిపిస్తున్నది.
పల్టీ రాజులు నితీశ్, బాబు
గతంలో మహా కూటమి తరఫున గెలిచిన నితీశ్‌కుమార్.. లోక్‌సభ ఎన్నికలకు ముందు మరోసారి పల్టీ కొట్టి.. ఎన్డీయే గూటికి చేరిపోయారు. ఆయన ఇలా పల్టీలు కొట్టడం కొత్తేమీ కాదు. చంద్రబాబు సైతం కూటములు మార్చిన చరిత్ర కలిగినవారే. ఒకప్పుడు మోదీని తీవ్రస్థాయిలో విమర్శించి.. ఇప్పుడు తన రాజకీయ అవసరాలకు ప్రశంసిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. ఎన్డీయేకు బలం ఉన్న రోజుల్లో పల్టీ కొట్టడం వేరు.. ఎన్డీయే బలహీనంగా ఉన్న రోజుల్లో పల్టీకొట్టడం వేరు. ముందు చెప్పుకొన్నట్టు ఎన్డీయే ఇప్పుడు చిన్న కుదుపును కూడా తట్టుకోలేని స్థితిలో ఉన్నది. ఈ సమయంలో జేడీయూ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హోదా కోసం పట్టుబడితే మోదీ సర్కార్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం చంద్రబాబుకు కూడా కీలకమే అయినప్పటికీ రాష్ట్రంలో రాజకీయంగా బలంగా నాటుకుపోయి.. తన కుమారుడు లోకేశ్‌ను భావి ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దుకునే ప్రయత్నాల్లో ఉన్నరన్న చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో ఆయన ప్రత్యేక హోదాకు పట్టుబట్టే అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షం కూడా ఏపీలో బలంగా లేని పరిస్థితి. వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుని 11 సీట్లతో సరిపెట్టుకున్నది. ఈ సమయంలో ప్రత్యేక హోదా కోసం బలంగా కొట్లాడే ప్రతిపక్షం కూడా ఏపీలో కరువైంది. ఇది చంద్రబాబుకు కలిసివచ్చే అంశమని చెబుతున్నారు. అయితే.. కనీసం ప్యాకేజీనైనా సాధిస్తారా? లేదా? అనే చర్చ మాత్రం జరుగుతున్నది. అదే సమయంలో పలు ఇతర రాష్ట్రాలు సైతం ప్రత్యేక హోదాలను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ కందిరీగల తుట్టెను మోదీ కదుపుతారా? లేక తాయిలాలు, ప్యాకేజీలతో సరిపెడతారా? అన్నది వేచి చూడాల్సిందే.