Site icon vidhaatha

బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేస్తారా?

ఢాకా ప్యాలెస్‌ వదిలి సురక్షిత ప్రాంతానికి ప్రధాని
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి లక్షల్లో జనం

ఢాకా : తన రాజీనామాను డిమాండ్‌ చేస్తూ దేశంలో హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి షేక్‌ హసీనా (Sheikh Hasina) తన ఢాకా ప్యాలెస్‌ను వదిలి, సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహిత నాయకుడొకరు వెల్లడించినట్టు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. ‘ఆమె, ఆమె సోదరి గణ భబన్‌ (Ganabhaban) (ప్రధాన మంత్రి అధికారిక నివాసం) నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లారు’ అని ఆ నాయకుడు తెలిపారు. ‘ఆమె ఒక ఉపన్యాసాన్ని రికార్డు చేయాలనుకున్నారు. కానీ.. అందుకు అవకాశం దొరకలేదు’ అని ఆయన చెప్పారు. ఆదివారం నాటి ఘర్షణలు, పోలీసుల కాల్పుల్లో (fierce clashes) 98 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గత నెల రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో చనిపోయిన వారి సంఖ్య 300కు పెరిగింది. ఈ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆర్మీ చీఫ్‌ వకెర్‌ ఉజ్‌ జమాన్‌ (Bangladesh’s army chief Waker-Uz-Zaman) ప్రసంగించనున్న సమయంలో ఆమె అధికారిక నివాసాన్ని వదిలి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకున్నది. హసీనా అధికారాన్ని గుంజుకునే చర్యలను నిలువరించాలని ఆమె కుమారుడు భద్రతాదళాలను కోరారు. మరోవైపు హసీనా రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్నకు.. అందుకు అవకాశాలు ఉన్నాయని ఒక సీనియర్‌ సలహాదారు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

బంగ్లాదేశ్‌లో 1971 విమోచన యుద్ధంలో పాల్గొన్న వెటరన్ల వారసులకు 30 శాతం రిజర్వేషన్‌ పునరుద్ధరించడం దేశ యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. ప్రధాని రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ఆదివారం చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో దేశంలో కర్ఫ్యూ (curfew) విధించారు. మూడు రోజులపాటు అన్ని కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయినప్పటికీ లక్షల మంది కర్ఫ్యూను ధిక్కరించి రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని అధికారిక నివాసం చుట్టూ ఇనుప కంచెలను వేశారు. సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. సుమారు నాలుగు లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఉంటారన్న అంచనాలు వెలువడుతున్నాయి.

తుది పోరాటానికి సమయం (The time has come for the final protest) ఆసన్నమైందని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్య నేతల్లో ఒకరైన ఆసిఫ్‌ మహ్మద్‌ చెప్పారు. పదిహేనేళ్లుగా బంగ్లాదేశ్‌ను పాలిస్తున్న షేక్‌ హసీనాకు ఇది అత్యంత గడ్డుకాలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఉద్యమానికి సినీ నటులు, సంగీత దర్శకులు, గాయకులు సైతం మద్దతు పలుకుతున్నారు.

Exit mobile version