Bengaluru Leopard Attack : సఫారీ వాహనంపైకి దూకిన చిరుతపులి..మహిళకు గాయాలు

సఫారీ వాహనంపైకి చిరుతపులి దూకి చెన్నై మహిళపై దాడి చేసింది. బన్నెర్ఘట్ట నేషనల్ పార్కులో జరిగిన ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయపడి, వీడియో వైరల్ అయింది.

Woman injured as leopard jumps on safari vehicle in Bannerghatta National Park

విధాత : సరదాగా సఫారీ వాహనం ఎక్కి అటవీ అందాలు..వన్యప్రాణులను తిలకించేందుకు వెళ్లిన పర్యాటకులకు ఓ చిరుత పులి చావు భయాన్ని చూపించింది. ఏకంగా సఫారీ వాహనం కిటికిలోంచి లోనికి దూకేందుకు ప్రయత్నించి కిటికీ వద్ద ఉన్న మహిళపై దాడి చేసిన ఘటన వైరల్ గా మారింది. కర్ణాటకలోని బన్నెర్ఘట్ట నేషనల్ పార్కులోలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో, బెంగళూరులోని బన్నెర్ఘట్ట నేషనల్ పార్కులో పర్యాటకులతో సఫారీ వాహణం అడవిలో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన చిరుతల బృందం ఒకటి తారసపడింది. వాటిని చూసేందుకు, ఫోటోలు తీసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో కొద్దిగా సఫారీ వాహనం కిటికీలు తెరిచారు.

ఇదే అదనుగా ఓ చిరుత పులి సఫారీ బస్సుపైకి దూకి కిటికి పక్కన ఉన్న చెన్నైకి చెందిన ఓ మహిళా పర్యాటకురాలిపై దాడికి పాల్పడింది. దీంతో ఆమె చేతికి స్వల్పంగా గాయమైంది. గాయపడిన మహిళను 50 ఏళ్ల వాహిత్ బానుగా గుర్తించారు. తన భర్త, కొడుకుతో కలిసి బన్నెర్ఘట్ట నేషనల్ పార్కు సందర్శనకు వచ్చింది. సఫారీ పార్కుల సమయంలో వన్యప్రాణులు ఎంత దగ్గరగా వస్తాయో చిత్రీకరించిన ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.