ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తున్నది. కాలుష్యరహితం కావడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఇదే కోవలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహారాష్ట్రలోని అటల్ సేతు, పుణె ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్‌లలో ప్రయాణించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఫోర్ వీలర్ ప్యాసింజర్ వెహికల్స్, ఈ బస్సులకు టోల్ ఫీజును మినహాయించారు. శుక్రవారం నుంచే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ వివేక్ భీమన్వర్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు అయి ఉన్నా.. గూడ్స్ క్యారియర్‌లు అయితే ఫీజు చెల్లించాల్సిందేనని చెప్పారు. ముంబై నగరంలో ఇటీవలి కాలంలో ఈ వాహనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. నగరంలో 25,277 ఈ బైకులు, సుమారు 13,000 ఈవీ కార్లు సహా అన్ని క్యాటిరీలు కలుపుకొని మొత్తం 43,000 ఈ వాహనాలు ఉన్నాయి.
అటల్ సేతుపై రోజూ 60వేలకు పైగా వాహనాలు నడుస్తుంటాయని అంచనా. రానున్న రోజుల్లో పుణె ఎక్స్‌ప్రెస్ వేకు కనెక్టయ్యేందుకు దీనిని విరివిగా ఉపయోగించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం దీనిపైనుంచి ఎంఎస్‌ఆర్టీసీ, ఎన్‌ఎంఎంటీ, ఇతర ప్రభుత్వ రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని రహదారులపైనా ఈవీలకు టోల్ ఫీజు రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ కొత్త ఈవీ పాలసీ మరింత మంది ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు దోహదం చేస్తుందని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనిద్వారా ఇంధన ఆధారిత వాహనాల రద్దీ తగ్గుతుందని అంటున్నాయి. పెరిగే వాహనాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లను కూడా నెలకొల్పుతున్నామని పేర్కొంటున్నాయి.