విధాత:ప్రతి సంవత్సరం ఆగస్టు 13 ను ప్రపంచ అవయవ దాన దినంగా జరుపుకుంటారు, అవయవ దానం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం అవయవ దానం కోసం ప్రతిజ్ఞ చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం జరుగుతుంది.
ఒక వ్యక్తి తమ గుండె, మూత్రపిండాలు, క్లోమం, ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు, చేతులు, ముఖం, కణజాలం, ఎముక మజ్జ,మూలకణాలను దానం చేయడం వలన దీర్ఘకాలిక అనారోగ్యం నుండి బాద పడుతున్న ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చు. అందువల్ల మరణం తర్వాత తమ అవయవాలను దానం చేయడం ద్వారా చాలామంది జీవితాన్ని కాపాడవచ్చు.
ఏ వయసు వారైనా తమ అవయవాలను అవసరమైన వ్యక్తికి దానం చేయవచ్చు. ఒకవేళ దాత 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, వారు అవయవ దాతగా నమోదు చేసుకోవడానికి తల్లిదండ్రులు లేదా వయోజన సంరక్షకుల సమ్మతిని కలిగి ఉండాలి.
అవయవ దానం చరిత్ర
మొట్టమొదటి అవయవ దానం 1954 లో రోనాల్డ్ లీ హెరిక్ తన కవల సోదరుడికి డాక్టర్ జోసెఫ్ ముర్రే పర్యావేక్షణలో కిడ్నీని దానం చేశారు. డాక్టర్ జోసెఫ్ ముర్రే అవయవ మార్పిడిలో పురోగతి కోసం 1990 లో ఫిజియాలజీ, మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు.
2015 లో, నవజాత శిశువు మూత్రపిండ వైఫల్యంతో ఒక వయోజనుడికి తన మూత్రపిండాలను దానం చేసి అతి పిన్న వయస్కుడైన అవయవ దాత అయ్యాడు. ఆ బాబు పుట్టిన తర్వాత కేవలం 100 నిమిషాలు మాత్రమే జీవించాడు.
2016 లో స్కాట్లాండ్‌లో మరణించిన తర్వాత 107 ఏళ్ల వృద్ధురాలు కార్నియా దానం చేసిన అత్యంత వృద్ధ దాత. అంతర్గత అవయవ దానం చేసిన మొదటి వృద్ధ అవయవ దాత 95 ఏళ్ల వెస్ట్ వర్జీనియా వ్యక్తి, అతను తన మరణానంతరం కాలేయాన్ని దానం చేశాడు.
భారతదేశంలో అవయవ దానం
అవయవ దానం చేయడానికి భారతదేశంలో మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం ఉంది. చనిపోయిన మరియు జీవించే వ్యక్తులు తమ అవయవాలను దానం చేయడానికి చట్టం అనుమతిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం, భారతదేశంలో 0.01 శాతం మంది మరణించిన తర్వాత తమ అవయవాలను దానం చేస్తున్నారు.