కొండా సురేఖ: మంత్రి కొండా సురేఖ పలు సందర్భల్లో తన మాటలు.. చేతలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఈ దఫా తను చేసిన చర్యతో మంత్రి డి.శ్రీధర్ బాబును కూడా ఇరికించేశారు. సరస్వతి పుష్కరాల యాప్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యర్థన ఆమెను ట్రోలింగ్ కు గురి చేస్తుంది. మా అన్నయ్య వాళ్ల మనవడు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేశాడని. ఏదైనా ఉద్యోగంలో పెట్టించండని సురేఖ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబును మౌఖికంగా అభ్యర్థించింది.
ఇందుకు మంత్రి శ్రీధర్ బాబు సరేనని చెప్పి.. పెట్టిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ను ఎవరో బయటకు లీక్ చేశారు. ఇంకేముంది ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా విభాగాలు మంత్రుల సంభాషణ వీడియో క్లిప్ తో ఓ ఆటాడేసుకుంటున్నారు. ఉద్యోగాల్లో మీ చుట్టాల పిల్లలను పెట్టించుకోటానికే అధికారం ఇచ్చారా అంటూ కొందరు..రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మంత్రుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండి పడుతున్నారు.
మెరిట్, స్కిల్స్ ఉంటే ఉద్యోగం అదే వస్తుందని.. బంధువుల కోసం మంత్రులు కష్టపడాల్సిన పని లేదని కామెంట్లు పెడుతున్నారు. బంధువుల ఉద్యోగం గురించి ఉన్న శ్రద్ధ… రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన మీద లేక పాయే అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మంత్రి కొండా సురేఖ నాగాచైతన్య, సమంత వివాదంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు, తన అనుచరుల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లి అధికారి కుర్చిలో కూర్చోవడం, తన కూతురు పుట్టిన రోజున దావత్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలలో సురేఖ ట్రోలింగ్ కు గురయ్యారు.