Site icon vidhaatha

AP: అమరావతికి సీఎం చంద్రబాబు మకాం!

విధాత : ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో సొంతింటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో చంద్రబాబుకు సొంత నివాస భవనం ఉంది. రాష్ట్ర విభజన పిదప ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్ ను లీజుకు తీసుకుని అక్కడే నివసిస్తున్నారు. అయితే ఏపీ రాజధాని అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురంలో ఒక ఇల్లును నిర్మించుకుంటున్న చంద్రబాబు తను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని అమరావతిలో కూడా శాశ్వత నివాసం ఉండాలని భావించారు.
ప్రస్తుత సచివాలయం ఉన్న వెలగపూడి రెవెన్యూ పరిధిలోనే చంద్రబాబు ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ-6 రోడ్డు మార్గానికి ఆనుకుని 5ఎకరాల స్థలాన్ని చంద్రబాబు తాజాగా కొనుగోలు చేశారు. ఇందులోని 25వేల చదరపు గజాల ప్లాట్ లో సొంతింటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు ఏప్రిల్ 9న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అదే రోజున చంద్రబాబు తన సొంతింటి నిర్మాణ పనులను కూడా ప్రారంభించాలని నిర్ణయించారు.

చంద్రబాబు సొంతింటి స్థలం స్పెషల్స్ ఇవే..

చంద్రబాబు నిర్మించుకోనున్న సొంతింటి స్థలానికి నాలుగు వైపులా రోడ్డు ఉండడం.. ప్రధానంగా రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సెస్ దీని పక్క నుంచి వెళ్తుండడంతో ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. స్థలం సమీపంలో ఎన్జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, విట్ విశ్వవిద్యాలయం, తాత్కాలిక హైకోర్టు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పాటు రవాణా పరంగానూ అనుకూలతులు ఉన్నట్లు భావించి కొనుగోలు చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న గవర్నమెంట్ కాంప్లెక్స్ కు ఈ స్థలం కేవలం రెండు కిలోమీటర్ల దూరం ఉండటం విశేషం. అమరావతికి తలమానికంగా చెబుతున్న ఐదు ఐకానిక్ టవర్లలో గవర్నమెంట్ కాంప్లెక్స్ కీలకమైంది. దీనికి సమీపంలోనే చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలంలో అత్యాధునిక వసతులతో ఇల్లు నిర్మించుకోనున్నారు. నూతన ఇంటిలో అందమైన గార్డెన్ తో పాటు భద్రతా సిబ్బంది నివాసాలు, పార్కింగ్ కోసం స్థలం కేటాయించారు. మంత్రి లోకేష్ కార్యాలయ సిబ్బంది, వాస్తు నిపుణులు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం నూతన గృహ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 9న శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా గృహ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీంతో త్వరలో చంద్రబాబు కేరాఫ్ అడ్రస్.. అమరావతికి మారనుంది.

నివాసంపై విమర్శలకు చెక్

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన స్వగ్రామం నారావారిపల్లిలో ఓ ఇల్లు ఉంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న నారావారిపల్లె ఇల్లుతో పాటు హైదరాబాద్ లో మరో ఇల్లు ఉంది. చంద్రబాబు ఎక్కువగా ఈ ఇంటిలోనే నివసించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి చంద్రబాబు రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో లింగమేని రమేష్ గెస్ట్ హౌస్ ను లీజుకు తీసుకున్న చంద్రబాబు ప్రస్తుత అందులోనే ఉంటున్నారు. ఇప్పుడు రాజధానిలో నిర్మాణం పూర్తి చేస్తే ఆయన శాశ్వత చిరునామా అమరావతికి మారుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి నిర్మాణ పనులు చేపట్టారు. అయితే చంద్రబాబుకు అమరావతిలో నివాసం లేదంటూ వైసీపీ నాయకులు అప్పట్లో విమర్శలు చేసేవారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు చంద్రబాబును పొరుగు రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకుడు అంటూ వ్యంగ్యంగా విమర్శించేవారు. చంద్రబాబుకు అమరావతి కంటే హైదరాబాద్ పైనే మక్కువ ఎక్కువ అంటూ విమర్శించేవారు. ఆ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత రెండోసారి సీఎం అయిన చంద్రబాబు అమరావతిలో స్థిర నివాసానికి ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా రాజధాని నిర్మాణంపై తన చిత్తశుద్ధి ప్రదర్శించుకున్నారు.

Exit mobile version