Banakacharla | విధాత, మహబూబ్‌నగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రానికి శత్రువులు ఎవరో కాదని ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు కోవర్టులేనని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పరోక్షంగా ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ ప్రాంతానికి శాపంగా మారనున్న ఏపీలో నిర్మింప తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటే లేఖలు రాసినంతమాత్రాన సరిపోదని చెప్పారు. తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవర్టులను టైట్ చేస్తేనే ఆ ప్రాజెక్టు ఆగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కోవర్టులు ఈ రోజు తెలంగాణలో ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో పెద్ద కాంట్రాక్టులన్నీ వాళ్లే చేస్తున్నారన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్‌లో దందాలు కూడా వాళ్లే చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కోవర్టులకు నల్లా, కరెంటు కనెక్షన్లు, ప్రాజెక్టులలో ఇవ్వాల్సిన బిల్లులు మొత్తం ఆపేస్తే అప్పుడు వాళ్లే వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకొని బనకచర్ల ప్రాజెక్టును నిలుపుదల చేయిస్తారని అనిరుధ్ రెడ్డి అన్నారు. మంచిగా చెబితే ఆంధ్రోళ్లు వినరని అన్నారు. ఈ పని చేస్తే వారం రోజుల్లో బనకచర్ల పనులు బంద్ అవుతాయని చెప్పారు. తాను ఈ విషయంగా చేస్తున్న సూచనను గమనించాలని మంత్రి ఉత్తమ్‌ను కోరారు. అనిరుధ్ ఇటీవల తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని, డబ్బులకు అమ్ముడుపోయి పక్క పార్టీలకు సమాచారం ఇస్తూ.. పార్టీకి నష్టం చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు మరువకుముందే అనిరుధ్ రెడ్డి కూడా అదే తరహా కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది.