అమరావతి: ముంబైకి చెందిన మోడల్/నటి కాదంబరి నరేంద్ర కుమార్ జెత్వానీని వేధించిన కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులను మంగళవారం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గత వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వంలో జెత్వానీపై నమోదైన ఒక కేసులో తగిన దర్యాప్తు లేకుండానే ఆమెను అక్రమంగా అరెస్టు చేసి, వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో ఆంజనేయులు ఒకరు. విషాల్ గున్ని, క్రాంతి రాణా టాటా మిగిలిన ఇద్దరు. జెత్వానీ కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారని అనిత తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌రావు అరెస్టయినట్టు చెప్పారు. ‘ఇదే కేసులో ఈ రోజు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆంజనేయులను అరెస్టు చేశారు. మేం పారదర్శకంగా ముందుకు వెళుతున్నాం. ఎలాంటి సాక్ష్యాలు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదు. అన్ని సాక్ష్యాలు సంపాదించిన తర్వాతే మేం కొన్ని చర్యలు తీసుకున్నాం’ అని తెలిపారు.
ఎవరినీ ఇబ్బందులకు గురిచేయాల్సిన అవసరం టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి లేదని అనిత స్పష్టం చేశారు. అయితే.. తప్పు చేసినవారికి శిక్ష మాత్రం తప్పదని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు కొందరు అధికారులు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటున్నారని ఆంజనేయులను ఉద్దేశించి హోం మంత్రి వ్యాఖ్యానించారు. గత ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకుల మెప్పు పొందేందుకు కొందరు అధికారులు గతంలో పనిచేశారని ఆమె విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎర్రా శ్రీలక్ష్మి వంటివారు అవినీతి కేసుల్లో అరెస్టుయిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదన్న అనిత.. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టారు కానీ.. అధికారులపై ఎన్నడూ మా కారణంగా కేసులు పెట్టే పరిస్థితి రాలేదని ఆమె గుర్తు చేశారు. రాష్ట్ర పోలీప్ శాఖ మీద, ఎన్డీయే ప్రభుత్వం మీద జెత్వానీ విశ్వాసం ఉంచిన విషయాన్ని తాను గ్రహించానని చెప్పారు. ఆమె ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.