విధాత : ఎంతో మంచి చేసిన మనమే డబుల్ డిజిట్ తో ప్రతిపక్షంలో కూర్చొన్నామని.. ఇక ఏ మంచీ చేయకుండా మోసం చేసిన చంద్రబాబును ప్రజలు సింగిల్ డిజిట్ కే పరిమితం చేసే రోజు వస్తుందని..తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని వైసీసీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. కూటమి పాలనలో ఇబ్బంది పడుతున్న ప్రతి కార్యకర్తకు జగన్ 2.0లో తోడుగా ఉంటాడన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన జరుగుతోందని..ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయన్నారు. చంద్రబాబు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారన్నారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని.. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయని విమర్శించారు.
రూపాయికి ఇడ్లీ రాదు గాని.. వేల కోట్ల భూములిస్తున్నారు
రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ..విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములు ఇస్తున్నారన్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను..టెండర్లు లేకుండా కట్టబెట్టారని విమర్శించారు. అమరావతి నిర్మాణ టెండర్లను రూ.36,000 కోట్ల నుంచి రూ.78,000 కోట్లకు పెంచేశారని..టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. కొత్తగా 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదన్నారు.
హామీల అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు
జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడని.. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయని జగన్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పానన్నారు. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పానని.. ఈ రోజు ప్రతి ఇంట్లో అదే చర్చ జరుగుతోందన్నారు. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్ రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు.