విధాత: మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఏసుబాబు అనే వ్యక్తి తనను మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మోసం చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తమ విజన్ ప్రాపర్టీ మేనేజ్ మెంట్ కు 20 లక్షలు ఇవ్వకుండా మోసం చేశారని ఏసుబాబు ఫిర్యాదులో ఆరోపించారు.
విజన్ ప్రాపర్టీ మేనేజ్ మెంట్ సర్వీస్ ద్వారా అరుంధతి హాస్పిటల్ కు 40 మంది సిబ్బంది కేటాయించామని, ఇందుకు రాజశేఖర్ రెడ్డి మొత్తం 50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి పలు దఫాలుగా 30 లక్షలు చెల్లించారని.. మిగిలిన డబ్బు ఇవ్వాలని అడిగితే స్పందించడం లేదని ఏసుబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ఇవ్వాల్సిన రూ.20లక్షలు ఇవ్వకుండా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మోసం చేశారని ఏసుబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలోనూ పలు కేసులు
గతంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ ఉప కమిషనర్ తన విధులకు ఆటంకం కల్గించారన్న ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిలుపు మేరకు నిర్వహించిన ఆందోళన సందర్భంగా తలెత్తిన వివాదంలో సదరు కేసు నమోదైంది. అంతకుముందు దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో మర్రి రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన ఐఏఆర్‌ఈ, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలకు చెందిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్) ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు.
ఇక మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూవివాదంలో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై పేట్ బషీరాబాద్ పోలీసులు 7 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పేట్ బషీరాబాద్ లో 32 గుంటల స్థలం చేశారని వారిపై ఆరోపణలున్నాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో ఈ కేసులు రిజిస్టర్ చేశారు.