మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) కథానాయకుడిగా నటించిన ‘మన శంకరవరప్రసాద్’ (Mana Shankara Vara Prasad Gaaru) సినిమాకు న్యాయపరంగా కీలక ఊరట లభించింది. ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూలు, రేటింగ్‌లను ఆన్‌లైన్ టికెటింగ్ యాప్ బుక్‌మైషోలో ప్రదర్శించవద్దంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసిన తర్వాత తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో, రేటింగ్‌ల ద్వారా వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థ కాస్త గతి తప్పి దుర్వినియోగం చేస్తూ, కొన్ని సినిమాలను లక్ష్యంగా చేసుకుని నెగిటివ్ రేటింగ్‌లు ఇస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై నిర్మాతలు చాలాకాలంగా అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఇంతకుముందు కన్నడ సినిమాల విషయంలోనూ ఇదే తరహా వివాదం చోటు చేసుకోగా, అప్పట్లో బెంగళూరు హైకోర్టు బుక్‌మైషోలో రివ్యూలు, రేటింగ్‌లకు అనుమతి ఇవ్వవద్దంటూ ఆదేశించింది. అదే మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్’ సినిమాకు సంబంధించి కూడా ఢిల్లీ హైకోర్టు ఇదే నిర్ణయం తీసుకుంది.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో బుక్‌మైషో రివ్యూ, రేటింగ్ ఆప్షన్‌ను పూర్తిగా డిజేబుల్ చేసింది. దీంతో ఈ సినిమాపై ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు నమోదు చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ వార్త తెలుగు నాట పెద్ద చర్చనీయాంశం అవుతుండగా మరికొందరు ఈ వార్తలపై కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ పోరాటంలో బ్లాక్‌బిగ్, ఐప్లెక్స్ సంస్థలు భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషనతో కలిసి ముందుండగా, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ మార్పుకు పూర్తి మద్దతు ప్రకటించాయి. సినిమా నిర్మాణం వెనుక పనిచేసే వేలమంది శ్రమను, కోట్ల రూపాయల పెట్టుబడిని కాపాడాలనే సంకల్పంతో ఈ సంస్థలన్నీ ఏకమయ్యాయి.
