Machilipatnam | Bandar
కొన్ని ఊరి పేర్లు చారిత్రక ప్రాధాన్యాన్ని, భౌగోళిక ప్రత్యేకతలను చాటుతూ ఉంటాయి. వాటి వారసత్వంగా ఊరిపేర్లుగా స్థిరపడిపోతుంటాయి. అలాంటి ఊళ్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని బందర్. బందర్ పేరు వెనుక కూడా గొప్ప చారిత్రక, భౌగోళిక ప్రత్యేకతలు ఉన్నాయి. మచిలీపట్నంగా ఉన్న ఒకప్పటి ముసలీపట్నం.. సముద్రతీరాన ఉన్నది. 16వ శతాబ్దంలోనూ, అంతకు ముందు కూడా పారశీకులు (పర్షియన్) అరబ్బులు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ వ్యాపారులు తమ వ్యాపార పనులపై నౌకల్లో ఇక్కడకు చేరుకునేవారు. వారు దీనిని బందర్ అని పిలిచారు. ముసలీపట్నం నుంచి మచిలీపట్నంగా, ఆ తర్వాత బందర్‌గా పేరు మారుతూ వచ్చింది. ఇప్పుడు మచిలీపట్నం లేదా ప్రేమగా బందర్ అని పిలుస్తున్నారు. ఆదిలో ఈ ప్రాంతాన్ని ముసలీపట్నం అని పిలిచేవారు.
ముసలి.. అంటే వృద్ధ అని అర్థం. వినికిడిలో ఉన్న జానపద కథల ప్రకారం.. పురాణ కాలంలో ఇక్కడ ఒక వృద్ధ ముని తపస్సు చేశాడని, దాని కారణంగానే ఇది ముసలీపట్నం అని పిలవడం మొదలైంది. కాలక్రమంలో ఉచ్ఛారణలో తేడా వచ్చి.. ముసలీపట్నం కాస్తా.. మచిలీపట్నంగా మారిందనేది మరో కథనం. దీనిని ప్రాతిపదిక.. మచిలీ. మచిలీ అంటే హిందీలో చేప అని అర్థం. చేపలు సమృద్ధిగా దొరికే కారణంగా దీనిని మచిలీపట్నం పిలిచారనేది మరొక కథనం. 16వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతం ప్రముఖ సముద్ర వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. అరబ్, పర్షియన్ వ్యాపారులు ఇక్కడ నౌకలకు లంగరు వేసి, వ్యాపారం చేసేవారు. వీరి భాషలైన అరబిక్, పర్షియన్‌లో బందర్ అంటే పోర్టు లేదా నౌకాశ్రయం అని అర్థం. అలా కాలక్రమేణా బందర్ అనే పేరు స్థిరపడిపోయింది.
బ్రిటిష్ కాలంలోనూ, డచ్ వాణిజ్యం సమయంలోనూ బందర్ పేరు బాగా ప్రాచుర్యం పొందింది. 17వ శతాబ్దం ప్రారంభంలో డచ్ ఈస్టిండియా కంపెనీ అయిన వీవోసీ.. (ఫెరేనిగ్డే ఆష్ట్‌ఇండీస్ కంపెనీ) దక్షిణ భారతదేశంలో వ్యాపార అవకాశాలు పెంచుకునేందుకు మచిలీపట్నానికి వచ్చింది. అప్పటికి ఆ ప్రాంతం ప్రపంచస్థాయి బందర్.. అదే ప్రపంచ స్థాయి ఓడరేవు. పత్తి, నూలు, కాషాయ వస్త్రాలు, కలంకారీ దుస్తులు, మసాలాలు వంటివి భారీగా లభించేవి. మచిలీపట్నానికి వచ్చిన డచ్‌లు.. అక్కడ చిన్న కోట, వ్యాపారానికి అవసరమైన గొడౌన్లు నిర్మించారు. స్థానిక రాజులతో ఒప్పందాలు చేసుకుని, మచిలీపట్నాన్ని ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా మలిచారు. ఆ కాలంలో అక్కడి నుంచే అనేక సరుకులు యూరప్ కంట్రీస్‌కు ఎగుమతి అయ్యేవి.