విధాత : దసరా సందర్బంగా ఊర్లలో రకరకాల ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. రూ.100కే మేక లేక గొర్రె, ఫుల్ బాటిల్ అని కొందరు..రూ.5లకే చొక్కా అని ఇంకొందరు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే ఎత్తులు వేస్తున్నారు. తాజాగా జిగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో దసరా ఆఫర్ పేరుతో ఓ బంపర్ ఆఫర్ పెట్టారు.
రూ.150 పెట్టి టోకెన్ కొనుగోలు చేస్తే మొదటి బహుమతిగా మేక, రెండో బహుమతిగా కాటన్ బీర్లు, మూడో బహుమతిగా విస్కీ ఫుల్ బాటిల్, నాలుగో బహుమతిగా కోళ్లు, ఐదో బహుమతిగా చీర లేక ఒక బీర్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. స్థానికంగా ఉండే సాయిని తిరుపతి అనే వ్యక్తి ఈ బంపర్ డ్రా నిర్వహిస్తుండగా..గ్రామస్తులు, చుట్టుపక్కల వారు ఎగబడి టోకెన్లు కొనుక్కుంటున్నారు. లక్కీ డ్రాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఆమనగల్లులో రూ.100 కొట్టు..మేకను పట్టు
ఆమనగల్లు మండలంలో దసర ఆఫర్ పేరుతో రూ.100 కొట్టు మేకను పట్టుఅంటూ లక్కీ డ్రా పెట్టడం ఇటీవల వైరల్ మారింది. భవానీ లక్కీ డ్రా నిర్వహాకులు పెట్టిన డ్రాలో రూ.100కు కూపన్ కొంటే డ్రాలో మొదటి బహుమతిగా 10కేజీల మేకను ఉచితంగా పొందవచ్చని ఆఫర్ పెట్టారు. ఆక్టోబర్ ఒకటో తేదీన సాయంత్రం లక్కీ డ్రా నిర్వహిస్తామని తెలిపారు. డ్రాలో రెండవ బహుమతిగా నాటుకోడితో పాటు 2 ఫుల్ బాటిల్లు, మూడవ బహుమతిగా నాటుకోడితో పాటు 12 బీర్లు, నాలుగవ బహుమతి సిగ్నేచర్ ఫుల్ బాటిల్ తో పాటు కిలో చికెన్, ఐదవ బహుమతి రాయల్ స్టాగ్ లీటర్ బాటిల్ తో పాటు కిలో చికెన్, ఆరవ బహుమతి మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్, ఏడవ బహుమతిగా మూడు 2 లీటర్ల థమ్సప్ బాటిల్స్ 3 గెలుచుకోవచ్చంటూ ఆఫర్ పెట్టారు.
దసరా అంటేనే ముక్కా..చుక్కా
తెలంగాణలో దసరా పండుగ అంటేనే ఫుల్లుగా మందు కొట్టడం, మటన్, చికెన్ తినడంగా సాగుతుంటుంది. దీంతో దసరా రోజున భారీగా మద్యం, మాంసం అమ్మకాలు..వినియోగం సాగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులంతా ఊర్లకు చేరి దసరాను ఘనంగా జరుపుకుంటారు. దేవి శరన్నవరాత్రుల ఆఖరి రోజున విజయ దశమి సందర్బంగా దసరా రోజున ఆయుధ పూజలు, వాహన పూజలు, శమీ పూజలు చేస్తుంటారు. దసరాను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా..ఈ రోజును రాముడు రాక్షస రాజు రావణుడిని సంహరించారని..దుర్గమాత మహిషాసురుడిని సంహరించిన రోజుగా పరిగణిస్తుంటారు. దసరా అంటే పది జన్మల పాపాలను పొగొట్టేదంటారు.
శమీ పూజలు..పాల పిట్ట దర్శనాలు
ఊరంతా జమ్మి(శమీ) వృక్షం చుట్టు ప్రదక్షిణలు చేసి..పూజలు నిర్వహిస్తారు. శమీ శమయతే పాపం..శమీ శతృ వినాశనం..అర్జునస్య ధనుర్థారి..రామస్య ప్రియదర్శిని అంటూ పూజలు చేస్తారు. జమ్మి పూజలు చేసి..విజయ సంకేతంగా భావించే పాలపిట్టను సందర్శిస్తారు. పరస్పరం జమ్మి ఇచ్చిపుచ్చుకుని అలింగనాలు చేసుకుని ఆత్మీయతను చాటుకుంటారు. పెద్దల ఆశిర్వాదం తీసుకుంటారు. పాండవులు అరణ్యవాసానికి వెళ్లెప్పుడు జమ్మి చెట్టుపై ఆయుధాలు ఉంచారని తిరిగి ఈ విజయదశమి రోజునే వచ్చి ఆయుధాలను తీసుకుని కౌరవులపై విజయం సాధించారని కూడా పురాణాలు చెబుతాయి. అలా విజయదశమి రోజున జమ్మిని పూజించటం ఆనవాయితీగా వస్తోంది.