Site icon vidhaatha

Tollywood | గద్దర్ అవార్డుల కమిటీలో.. తెలంగాణవాళ్లెక్కడ?

తెలుగు సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రదర్శన కనబర్చినవారికి అందించే గద్దర్ అవార్డుల జ్యూరీపై విమర్శలు వస్తున్నాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు చలన చిత్ర అవార్డులను ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్ర ఆధిపత్యం కనిపిస్తున్నదనే వాదన వినిపిస్తున్నది. చెప్పుకోతగిన తెలంగాణ ప్రముఖులు లేరని అంటున్నారు. సినీ పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయినవారికి ఆ బాధ్యతలు అప్పగించారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆధిపత్యం ఈ జ్యూరీపై కనిపిస్తున్నదని అంటున్నారు. అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చిన జ్యూరీలోని సభ్యుడైన వీఎన్ ఆదిత్య కూడా అరవింద్ మనిషేనని చర్చ నడుస్తున్నది. కులాల వారీగా పంపకాలు అన్నట్టు తయారైందనే అభిప్రాయాలూ ఉన్నాయి.

వాస్తవానికి తెలుగు సినీ పరిశ్రమలో మొదటి నుంచీ ఆంధ్ర ప్రాంతపు వారు అధికంగా ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన దగ్గర నుంచీ ఆ ఆధిక్యం కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలోనే జ్యూరీ కమిటీలో ఆంధ్ర ప్రాంత దర్శకులు, నటులు ఎక్కువ ఉన్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నామినేషన్స్ ఉన్నవాళ్లను జ్యూరీలో వేయరు. ఈసారి అవార్డులకు పోటీలో తెలంగాణ దర్శకులు, నటుడు చాలామందే ఉన్నారు. ‘

రుద్రంగి, రజాకార్, బలగం, మల్లేశం వంటి సినిమాలు, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, వేణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి వర్మ, దివి విధే, పీజీ వింద, తోట రాము (కెమెరా), బలగం వేణు, విరాటపర్వం వేణు, దాస్యం తరుణ్ భాస్కర్, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, ప్రవీణ్ శ్రీ రామ్, సంపత్ నంది తదితర దర్శకులు నామినేషన్లలో ఉన్నారు. దీంతో వేసిన జ్యూరీ తగిన విధంగా లేదని పలువురు అంటున్నారు.

ఈ జ్యూరీకి సీనియర్‌ నటి జయసుధ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుండగా, నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్‌, దర్శకుడు దశరథ్‌, దర్శకురాలు నందిని రెడ్డి, ఎగ్జిబిటర్‌ విజయ్‌కుమార్‌ రావు, జర్నలిస్టు లక్ష్మీనారాయణ, దర్శకుడు ఎల్‌ శ్రీనాథ్‌, సినీ విశ్లేషకుడు ఆకునూరు గౌతమ్‌, గీత రచయిత కాసర్ల శ్యాం, దర్శకుడు సీ ఉమామహేశ్వర్‌రావు, దర్శకుడు శివ నాగేశ్వర్‌రావు, దర్శకుడు వీఎన్‌ ఆదిత్య, జర్నలిస్టు జీ వెంకట రమణ, నిర్మాత ఏడిద రాజా సభ్యులుగా ఉన్నారు. మెంబర్‌ కన్వీనర్‌గా తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ వ్యవహరిస్తారు.

Exit mobile version