Heavy rain : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదారబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో.. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన ప్రకారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయి. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి దిశలో ఉపరితల గాలులు వీస్తాయి. గంటకు 10-12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 85 శాతంగా ఉంది.
ఏపీలోని యానాంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు జూలై 24న వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. ఒకటి రెండు చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.