విధాత, నల్లగొండ: రాష్ట్రంలో ఓ వైపు వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో సమగ్రంగా లేని ఓటర్ లిస్ట్ లను పెట్టి గందరగోళం చేస్తూ కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి(Ex-Minister Jagadish Reddy) ఆరోపించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు మూడు నెలల టైమ్ ఇస్తే రెండు నెలలు నిద్రపోయి.. ఇప్పుడు ప్రభుత్వం హడావుడి చేస్తుందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల మోసం తెలియడంతో ఓటర్ల జాబితాల పేరుతో మరో డ్రామాకు తెర తీస్తుందని విమర్శించారు. శుక్రవారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరదల వేళ సరైన ప్రచారం లేకుండానే ఓటర్ల జాబితా ప్రక్రియతో ఎన్నికల కమిషన్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం అన్ని ఓటర్ లిస్టులను గ్రామాల్లో బహిరంగపర్చాలని.. అన్ని అభ్యతరాలను పరిగణనలోకి తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓ వైపు భారీ వర్షాలు… మరోవైపు యూరియా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ఆయా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో పెడితే మాకేం ఇబ్బంది లేదని, ఒరిజినల్ నివేదికను బహిరంగ పర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు.
అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ప్రజలు బీఆర్ఎస్(BRS) తలుపు తడుతున్నారని, ఉద్యోగులు భృతి కోసం, నిరుద్యోగులు జాబ్ క్యాలండర్ కోసం.. విద్యార్థినులు స్కూటీల కోసం.. రైతులు రుణమాఫీ, రైతు భరోసా, యూరియా, కరెంటు కోతలపై మమ్ములను అసెంబ్లీలో అడగమని కోరుతున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. వరదలపై ప్రభుత్వానికి సోయి లేదని, సీఎం రేవంత్ రెడ్డి పాత పద్ధతుల్లోనే రోత మాటలు మాట్లాడుతున్నాడని, మంత్రులకు వరదలు, ప్రాజెక్టులపై రివ్యూ చేయాలనే సోయి కూడా లేదని విమర్శించారు. గోదావరి, కృష్ణాలో వందలాది వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంటే నల్గగొండ జిల్లా కేంద్రంలోని ఉదయసముద్రం రిజర్వాయర్ లో తగినంత నీరు లేదని..దీనిపై జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి(Komatireddy Venkat Reddy) ఇప్పటికే సోయి లేదన్నారు.
