విధాత: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో గత డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ సాధించిన చిత్రం సలార్. షారుఖ్ ఖాన్ డంకీ చిత్రానికి పోటీగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అనేక రికిర్డులను తిరగరాయడమే కాక ప్రభాస్‌ను సగటు ప్రేక్షకుడు ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటారో ఆ క్యారెక్టర్‌లో చూసి పండుగ చేసుకున్నారు. ఈ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఫ్యాన్స్ ప్రత్యేక సంబురాలు సైతం చేసుకున్నారు.
అయితే ఇటీవల ఈ మూవీ సీక్వెల్‌పై ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘సలార్’ విషయంలో తాను డిసప్పాయింట్ అయ్యానని, ఆ సినిమాను ఇంకా బాగా చేసి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సీక్వెల్ విషయంలో మాత్రం ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని, ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేది లేదన్నాడు. ‘సలార్ విషయంలో నేను చాలా కష్టపడ్డాను కానీ కేజీఎఫ్ 2 ఇచ్చినంత తృప్తి సలార్ ఇవ్వలేకపోయింది.
అందుకే సలార్ రిలీజ్ అయినప్పుడే డిసైడ్ అయ్యా.. సలార్ 2ను నా బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా చేయాలని. సలార్ 2కు నా రైటింగ్ నా బెస్ట్ వర్క్ అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఆడియన్స్ ఎంత ఊహించుకుంటున్నారో, నేను ఎంత చేయాలని అనుకుంటున్నానో అంతకు మించి సలార్ 2 ఉంటుంది. కొన్ని విషయాలు మాత్రమే నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండేలా చేస్తాయి. సలార్ 2 అనేది ఏ మాత్రం డౌట్ లేకుండా నా బెస్ట్ వర్క్’’ అంటూ ‘సలార్ 2’పై విపరీతమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు ప్రశాంత్ నీల్. దీంతో ఫ్యాన్స్‌లో అంచనాలు కూడా పెరిగిపోయాయి.