Hanuman | PRASANTH VARMA
విధాత : హనుమాన్ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా వెలువడిన కథనాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రశాంత్ వర్మ బ్లాక్ బస్టర్ సినిమా హనుమాన్ కు సిక్విల్ గా జై హనుమాన్ తెరకెక్కుతుంది. జై హనుమాన్ సినిమాలో లీడ్ రోల్ ను జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి పోషిస్తున్నారు. రాణా దగ్గుబాటి మరో పాత్రలో నటిస్తున్నారు. జై హనుమాన్ సినిమా భారీ మల్టీస్టారర్ సినిమాగా రూపొందించేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కసరత్తు చేస్తున్నాడని తెలుస్తుంది.
కనీ వినీ ఎరుగని స్పాన్‌లో భారీ మల్టీస్టారర్ సినిమాగా తెర కెక్కించాలన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నాడని..ఎందుకంటే జై హనుమాన్ కథ డిమాండ్ అందుకు అనుకూలంగా ఉందని దర్శకుడు భావిస్తున్నాడట. ‘జై హనుమాన్’ కేవలం హనుమాన్ కథ మాత్రమే కాదని..సప్త చిరంజీవుల కథ అని తెలుస్తుంది.
మన పురాణాల్లో అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు వీళ్లందరినీ చిరంజీవులుగా పేర్కొన్నారు. వీళ్లందరి కథే జై హనుమాన్ సినిమా కథ అని సమాచారం. కథను సమగ్రంగా తెరకెక్కిస్తే ఒక్కో పాత్రకు ఒక్కో హీరోని తీసుకుంటే తెర నిండా హీరోలే కనిపిస్తారని.. ప్రస్తుతం సినిమా స్క్రిప్టు వర్క్ జరుగుతోందని.. నిడివి.. కథనంలో బిగుతు కోల్పోకుండా జై హనుమాన్ కథను ఎక్కడి వరకు లాక్ చేయాలన్నదానిపై దర్శకుడు కసరత్తు చేస్తున్నారని సమాచారం.