MLC Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సాగిస్తున్న బీసీ ఉద్యమానికి సీపీఎం మద్దతు ప్రకటించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో మంగళవారం కవిత భేటీ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై జూలై 17న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్ధతివ్వాలని ఆమె వారికి వినతి పత్రం అందించారు. కవిత అభ్యర్థనకు జాన్ వెస్లీ సానుకూలంగా స్పందించారు. భేటీ అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లుగా ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ అని.. సామాజిక న్యాయం కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై జూలై 17న చేపట్టనున్న రైల్ రోకోకు మద్దతునిస్తామని తెలిపారు. రిజర్వేషన్లను పెంచి అసమానతలను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు. బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంటుందని.. మొన్నటి వరకు కులగణనను కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకించిందన్నారు. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి కులగణన చేయడానికి తాజాగా బీజేపీ ముందుకొచ్చిందని.. అయితే రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర బీజేపీ నాయకులు నోరువిప్పడం లేదని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేసే బాధ్యత బీజేపీ నాయకులపై కూడా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కేవలం కేంద్రానికి వినతి పత్రాలు అందించే వరకు మాత్రమే పరిమితం కావద్దన్నారు. బిల్లు ఆమోదం కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని స్పష్టం చేశారు.
కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ఉద్యమం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం గత రెండేళ్లుగా ఉద్యమిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించిందన్నారు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు మూడు నెలల క్రితమే వెళ్లినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ చేసినా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో బీపీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం అంశంపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. బిల్లు ఆమోదం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ఉద్యమబాటనే మార్గం అని..అందుకోసం జూలై 17న రైల్ వ్యవస్థను స్థంభించే విధంగా రైల్ రోకో చేపట్టబోతున్నామని తెలిపారు. కలిసివచ్చే భావసారుప్యతగల శక్తులన్నింటినీ మద్ధతు కోసం కలుస్తున్నామన్నారు. ఉద్యమాలకు పేరెన్నికగల సీపీఎం పార్టీ నాయకులను కూడా కలిశామని..బిల్లు ఆలస్యమైతే బీసీలు ఉద్యోగులు, విద్యార్థులు రిజర్వేషన్లలో వాటాను కోల్పోతారన్నారు. కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ లలో పెట్టే తెలంగాణ తల్లి విగ్రహాలను తాము కాంగ్రెస్ తల్లి విగ్రహాలుగానే చూస్తున్నామని..మళ్లీ మేం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తొలగించి గాంధీ భవన్ కు తరలిస్తామన్నారు. కాంగ్రెస్ తల్లి విగ్రహాల స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ ప్రతీకలను పక్కకు తోసి కొత్త వాటిని ఉద్యమ ప్రతీకలుగా చేస్తున్న కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్దం చేసుకుంటారన్నారు.
న్యూడెమోక్రసీ నేతలతో కవిత భేటీ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై జూలై 17న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు వెంకటేశ్వరరావు, చలపతి రావు, గోవర్ధన్ లను కలిశారు. కవిత అభ్యర్థనకు వారు సానుకూలంగా స్పందించారు.